‘తుమ్మిడిహెట్టి’పై ముందుకే..
ABN , Publish Date - May 01 , 2026 | 05:29 AM
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి అవసరమైన అనుమతులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టడానికి వీలుగా మహారాష్ట్రతో సంప్రదింపులు
15రోజుల్లో ఆ రాష్ట్ర సీఎంతో రేవంత్ భేటీ
సంప్రదింపుల్లో వేగం పెంచాలని నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి అవసరమైన అనుమతులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, ఆ తర్వాత నీటిని ఏ విధంగా.. ఎక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తరలించాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకొని.. మహారాష్ట్రతో అంతరాష్ట్ర సంప్రదింపుల ప్రక్రియను చేపట్టాలని నిర్దేశించారు. తొలుత చీఫ్ ఇంజనీర్లు(సీఈ)ల స్థాయిలో, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల కార్యదర్శుల స్థాయిలో, నీటిపారుదలశాఖ మంత్రుల స్థాయిలో చర్చల ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేస్తే.. 15 రోజుల్లోగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీ్‌సతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. వాస్తవానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి 2016 మార్చి 8న మహారాష్ట్రతో ఒప్పందంకూడా జరిగిన విషయం విదితమే. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని అందించడానికి 71.5 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మాణం కూడా పూర్తయింది. అయితే 148 మీటర్లతో బ్యారేజీ కడితే నిర్దేశిత లక్ష్యం మేరకు నీటిని గ్రావిటీతో తరలించలేమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోంది. ఈలోగా మహారాష్ట్రతో సంప్రదింపుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ తప్పు జరగకుండా...
గతంలో అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో హెడ్ వర్క్(తుమ్మిడిహెట్టి బ్యారేజీ) కట్టకుండా ఇతర పనులు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇదే కారణాన్ని చూపించి.. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో, ప్రాణహిత-చేవెళ్లలోనూ కామన్ పాయింట్ ఎల్లంపల్లి కాగా.. ఈ ప్రాజెక్టు పనులు 2014 నాటికే 90ు పూర్తయ్యాయి. పలు పంప్‌హౌ్‌సల పనులు కూడా 30-40 శాతం దాకా పూర్తయ్యాయి. రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే తుమ్మిడిహెట్టి ఒక్కటే మార్గమని గుర్తించిన ప్రభుత్వం.. తొలుత బ్యారేజీని గట్టెక్కించే పనిలో పడింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి ఏయే అడుగులు వేయాలనేదానిపై శుక్రవారం మంత్రి ఉత్తమ్ అధికారులతో సమావేశమై తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు.