కొన్నిసార్లు చిన్న పొరపాట్లతోనే కుటుంబాలు వీధిన!
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:58 AM
జీవితంలో రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత కీలకం అని, కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లతోనే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని...
రోడ్డు భద్రతపై అవగాహన కీలకం: పొన్నం
గత ఏడాది ప్రమాదాల్లో 7,500 మృతి
బైక్‌లు కొనివ్వాలని కన్నవారిపై ఒత్తిడి తేకండి: డీజీపీ
హైదరాబాద్, కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జీవితంలో రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత కీలకం అని, కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లతోనే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వాహనాలతో రోడ్డు మీదకొచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా కంకణం కట్టుకోవాలన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యాచరణలో కింద ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఐదోరోజు హైదరాబాద్ నాగోల్‌లోని బాబు జగ్జివన్ రామ్ డ్రైవింగ్ సెంటర్లో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రోడ్డు భద్రత కోసం ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ కేర్ అనే సూత్రాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా రోడ్డు భద్రత ఉల్లంఘన అనేది సామాజిక సమస్యగా మారిందని, పరిష్కారానికి పోలీసు, రవాణా శాఖలు మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ శివధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. దీనికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నిరుడు రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది చనిపోయారని డీజీపీ తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బైకులు కొనివ్వాలని తల్లిదండ్రులపై పిల్లలు ఒత్తిడి తేవొద్దని కోరారు.
చట్టసభల్లోని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేం
చట్టసభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండదని శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విభజనను భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వాయఖ్యలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మీడియా ప్రశ్నించగా డీజీపీ ఈ విధంగా స్పందించారు.