Share News

8 రకాల వరి వంగడాలతోనే రైతులకు లాభాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:15 AM

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ డిమాండ్‌ ఉన్న 8 రకాల మేలైన వరి వంగడాలనే సాగు చేసేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలని....

8 రకాల వరి వంగడాలతోనే రైతులకు లాభాలు

  • అంతర్జాతీయంగానూ డిమాండ్‌

  • సబ్‌కమిటీకి నివేదించిన శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ డిమాండ్‌ ఉన్న 8 రకాల మేలైన వరి వంగడాలనే సాగు చేసేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, శాస్త్రవేత్తలు సూచించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశానికి.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. రైతులకు లాభదాయకమైన బీపీటీ- 5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌- 15048), కేఎన్‌ఎం- 1638, జై శ్రీరామ్‌, హెచ్‌ఎంటీ, డబ్ల్యూజీఎల్‌- 962, డబ్ల్యూజీఎల్‌- 44, జేజీఎల్‌- 1798 అనే ఎనిమిది రకాల వంగడాలను సాగు చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు మంత్రులకు సూచించారు. ఈ వంగడాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ వల్ల ప్రభుత్వ మద్దతు ధర కంటే చాలా ఎక్కువ ధర లభించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూర్‌పలలో ఈ బియ్యానికి విపరీతమైన ఆదరణ ఉందని, వీటికి విత్తనాల కొరత కూడా లేదని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల్లో వచ్చే ఒడిదొడుకుల నుంచి రైతులకు రక్షణ లభించాలన్నా ఈ 8 రకాల సాగు ఒక్కటే మార్గమని తెలిపారు. రాష్ట్రంలో సాగవుతున్న అన్నిరకాల సన్న బియ్యానికి మార్కెట్‌లో ఆదరణ లభించడం లేదని, కొన్నిరకాల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తున్నప్పుడు నూకలు ఎక్కువగా వస్తున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. డిమాండ్‌ లేని రకాల సాగును క్రమంగా తగ్గించి, ఎగుమతులకు ఉపయోగపడే నిర్దిష్ట రకాలనే ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర విధానాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని మంత్రులకు అధికారులు నివేదించారు.

Updated Date - Jun 16 , 2026 | 05:15 AM