Share News

Telangana Power Debt: తెలంగాణ విద్యుత్‌ సంస్థల అప్పులు.. రూ.1,02,328 కోట్లు

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:36 AM

తెలంగాణ విద్యుత్‌ సంస్థల అప్పులు అక్షరాలా రూ.1,02,328 కోట్లకు చేరాయి. ఈ అప్పుల్లో రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి రూ.45,373 కోట్లు తీసుకోగా...

Telangana Power Debt: తెలంగాణ విద్యుత్‌ సంస్థల అప్పులు.. రూ.1,02,328 కోట్లు

  • కరెంట్‌ కొనుగోళ్లకు రూ.53,101 కోట్ల రుణాలు తీసుకున్న డిస్కమ్‌లు

  • థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాలకు రూ.31,478 కోట్ల అప్పులు చేసిన జెన్‌కో

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ సంస్థల అప్పులు అక్షరాలా రూ.1,02,328 కోట్లకు చేరాయి. ఈ అప్పుల్లో రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి రూ.45,373 కోట్లు తీసుకోగా... పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ) నుంచి రూ.43,802 కోట్లు తీసుకున్నారు. ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.13,153 కోట్లు. దక్షిణ డిస్కమ్‌(టీజీఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌), ఉత్తర డిస్కమ్‌ (టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌)లు విద్యుత్‌ కొనుగోళ్ల కోసం రూ.53,101 కోట్ల రుణం తీసుకోగా.. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం తెలంగాణ జెన్‌కో 9.3 శాతం నుంచి 11.5 శాతం వార్షిక వడ్డీకి రూ.13,582.99 కోట్ల పీఎ్‌ఫసీ టర్మ్‌లోన్‌, 9.3-11.15 శాతం వార్షిక వడ్డీతో ఆర్‌ఈసీ నుంచి రూ.17,010.95 కోట్ల రుణం తీసుకుంది. బ్యాంకుల నుంచి రూ.930.58 కోట్లు తీసుకుంది. డిస్కమ్‌లు తీసుకున్న రుణాల చెల్లింపు ప్రక్రియ 2034-35 ఆర్థిక సంవత్సరంలో పూర్తికానుంది. కాగా తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.7,840 కోట్ల అప్పులు ఉన్నాయి.


అప్పులు, నష్టాలకు కేరాఫ్‌ డిస్కమ్‌లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు డిస్కమ్‌ల నష్టాలు రూ.12,186 కోట్లు. ఇందులో ఎస్పీడీసీఎల్‌ వాటా రూ.8,641 కోట్లు కాగా... ఎన్పీడీసీఎల్‌ వాటా రూ.3,545 కోట్లు. ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరం భారీగా ఉండటంతో డిస్కమ్‌లు 2014-15 నుంచి ఏ ఏడాదీ లాభాలు చూడలేదు. 2014-15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఒక్క దక్షిణ డిస్కమ్‌ నష్టాలే ఏకంగా రూ.41,105 కోట్లకు చేరగా.. ఉత్తర డిస్కమ్‌ నష్టాలు రూ.17,984 కోట్లకు చేరాయి. కరెంట్‌ కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ చెల్లింపులు చేయలేని పరిస్థితి. డిస్కమ్‌లు కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థలకు (ఎన్‌టీపీసీ, ఎన్‌సీ, ఎన్‌పీసీ, సెకీ) రూ.2,512 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉండగా.. తెలంగాణ జెన్‌కోకు రూ.11,279 కోట్లు కట్టాల్సి ఉంది. ఏపీ జెన్‌కోకు (ప్రస్తుతం బకాయిల వివాదం ఉంది) రూ.3441 కోట్లు, సింగరేణికి రూ.12,310 కోట్లు, తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.1,366 కోట్లు కలుపుకొని రూ.28,396 కోట్ల బిల్లులు కట్టాలి. ఛత్తీస్‌గఢ్‌కు రూ.1,340 కోట్లు కట్టాల్సి ఉంది. సంప్రదాయేతర ఇంధన వనరులు అందిస్తున్న సంస్థలకు రూ.453 కోట్లు, సెమ్‌కార్బ్‌కు రూ.149 కోట్ల బిల్లులు కట్టాలి. విద్యుత్‌ కొనుగోళ్లకే డిస్కమ్‌లు రూ.32,850 కోట్లు కట్టాలి. సింగరేణికి తెలంగాణ జెన్‌కో రూ.16,465 కోట్లు కట్టాలి.


కరెంట్‌ మిక్స్ అయితేనే..

కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి సగటు కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.86 అవుతుండగా.. తెలంగాణ జెన్‌కో నుంచి కొనుగోలు చేసే కరెంట్‌ యూనిట్‌కు రూ.5.46 పడుతుంది. బహిరంగ విపణిలో (ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌) రూ.3.90 పడుతోంది. స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారుల(ఐపీపీ) నుంచి యూనిట్‌కు రూ.4.63, సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి కొనుగోలు చేసే కరెంట్‌ యూనిట్‌కు రూ.4.50 పడుతుంది. ఇక.. సోలార్‌ యూనిట్‌ ధర రూ.3 లోపే ఉంటుంది. కాబట్టి, సోలార్‌, థర్మల్‌ను మిక్స్‌ చేసుకుంటేనే ధర గిట్టుబాటు కానుంది.

సర్కారీ బకాయిలు రూ.46,424 కోట్లు

2025 సెప్టెంబరు 1 నాటికీ తీసిన లెక్కల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల కనెక్షన్ల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిలు రూ.46,424 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వాటాయే రూ.8645.77 కోట్లు కాగా.. ఇతర పథకాల వాటా రూ.14,722.37 కోట్లు. మిషన్‌ భగీరథ వాటా రూ.6,108.06 కోట్లు కాగా, హైదరాబాద్‌ వాటర్‌బోర్డు బాకీ రూ.7,259.53 కోట్లుగా ఉంది. ఇంధన శాఖ సైతం రూ.51.39 కోట్ల మేర డిస్కమ్‌లకు బాకీ ఉంది. ఇతర శాఖల బకాయిలు కూడా గుట్టలుగా పేరుకున్నాయి. ప్రభుత్వ శాఖలు డిస్కమ్‌లకు బిల్లులు కడితే.. డిస్కమ్‌లు జెన్‌కోలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. జెన్‌కోలకు డిస్కమ్‌ల నుంచి డబ్బులు వస్తే... జెన్‌కో సింగరేణికి బకాయిలు చెల్లించగలుగుతుంది!!

Updated Date - Jan 15 , 2026 | 05:37 AM