Share News

రైతు డిస్కమ్‌ ఏర్పాటు ఎందుకో చెప్పండి

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:10 AM

రైతు డిస్కమ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందో స్పష్టం చేయాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

రైతు డిస్కమ్‌ ఏర్పాటు ఎందుకో చెప్పండి

  • సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలి

  • దక్షిణ, ఉత్తర డిస్కమ్‌లను ప్రైవేటీకరిస్తే ఉద్యమం: పవర్‌ జేఏసీ హెచ్చరిక

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రైతు డిస్కమ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందో స్పష్టం చేయాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ డిస్కమ్‌ సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయని, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన చేయరాదని కోరింది. కాదని ముందుకెళితే ఉద్యమం తప్పదని హెచ్చరించింది. టీజీఆర్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీతో మంగళవారం ఖైరతాబాద్‌లో జేఎసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం 1104 యూనియన్‌ కార్యాలయంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రైతు డిస్కమ్‌పై నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే డిస్కమ్‌లలో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త సబ్‌స్టేషన్లకు ఆపరేటర్లు కూడా లేరని పేర్కొ న్నారు. వెయ్యిమంది అధికారులు, వెయ్యిమంది కార్మికులను రైతు డిస్కమ్‌కు పంపిస్తే సిబ్బంది కొరత మరింత పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ ఛైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు, జనరల్‌సెక్రటరీ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 07:11 AM