భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:40 AM
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. శుక్రవారం(ఈనెల 14న) విద్యుత్ డిమాండ్ 17085 మెగావాట్లుగా రికార్డయింది.
14న ఒక్కరోజే 17,085 మెగావాట్లుగా నమోదు
హైదరాబాద్, గద్వాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. శుక్రవారం(ఈనెల 14న) విద్యుత్ డిమాండ్ 17085 మెగావాట్లుగా రికార్డయింది. పలుచోట్ల ఎత్తిపోతల పథకాల పంపింగ్ జోరుగా జరుగుతుండటం, వ్యవసాయ పంపుసెట్ల కింద సాగు విస్తీర్ణం పెరగడమే విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 300 మిలియన్ యూనిట్లుగా వినియోగం రికార్డు అయింది. ప్రాణహిత, ఇంద్రావతికి వరదలు బాగా వస్తుండటంతో దేవాదుల ఎత్తిపోతల పథకంలో పంపులను తిప్పుతున్నారు. 9 చోట్ల పంపులు నడిపిస్తూ రిజర్వాయర్లను, చెరువులను నింపుతున్నారు. రాజీవ్ బీమా, జవహర్ నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పంపులు నడుపుతున్నారు. వానలు పడకపోవడంతో రైతాంగం బోరుబావుల మీద ఆధారపడి పంటల సాగును పెంచింది. దీంతో 30 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లను నడిపిస్తుండటంతో ఇది కూడా డిమాండ్, వినియోగం పెరగడానికి కారణంగా మారింది.
శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో నిల్
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద ఇన్‌ఫ్లో శనివారం పూర్తిగా నిలిచిపోయింది. 12రోజులుగా ఆలమట్టి నుంచి వస్తోన్న వరద ఆగిపోవడంతో ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 176.331 టీఎంసీలకు పరిమితమైంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ స్థాయి నిల్వ 215.810 టీఎంసీలు కాగా, ఎగువ నుంచి రెండు లక్షల క్యూసెక్కులు దాటి వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలోకి 222 టీఎంసీల దాకా కృష్ణా జలాలు వస్తాయని జలవనరుల శాఖ ఆశించింది. కానీ అంత కంటే తక్కువకే ప్రస్తుతం నిల్వ పరిమితమైంది. అయితే పోతిరెడ్డిపాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 72,640 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దిగువన నాగార్జునసాగర్‌లో గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ 158టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 54,022 క్యూసెక్కుల వరద వస్తోంది.1800 క్యూసెక్కులను వదులుతున్నారు.