ముందుచూపు లేకే విద్యుత్తు కోతలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:55 AM
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
అప్రకటిత కోతలతో ప్రజలకు ఇబ్బందులు
విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవు
అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలం: హరీశ్
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అప్రకటిత విద్యుత్తు కోతల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఆర్‌ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త అని.. ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంటు కోతలు విధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాది, యాదాద్రి పవర్ స్టేషన్లలో వారం రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని చెప్పారు. నీటి నిల్వ, బొగ్గు సరఫరా, విద్యుత్తు కేంద్రాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కక్కుర్తితోనే గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేయకుండా పారిశ్రామిక వేత్తలను ఇబ్బందిపెడుతున్నారని దుయ్యబట్టారు. సింగరేణి వెబ్‌సైట్ మూసివేసి బొగ్గు సరఫరా, నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారని మండిపడ్డారు. నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులను మరో సారి చీకట్లోకి నెట్టే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ పాలన అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్న విద్యుత్తు కష్టాలను మళ్లీ తీసుకురావడమేనా అని ప్రశ్నించారు.