11 చోట్ల ఎన్నికలు వాయిదా
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:05 AM
రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు ఏర్పడటంతో వాయిదా పడగా, మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు...
జనగామ, ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలు
బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను ఆ పార్టీవారే కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ నిరసన
కొన్నిచోట్ల కౌన్సిలర్లు ఆలస్యంగా రావటంతో ఎన్నిక వాయిదా
ఆ 11 చోట్ల నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు: ఎన్నికల సంఘం
ఇబ్రహీంపట్నంకు ప్రత్యేక పరిశీలకుడిని పంపాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు ఏర్పడటంతో వాయిదా పడగా, మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాకపోవటం, కోరం లేకపోవటం వంటి కారణాలతో వాయిదా వేశారు. ఈ మున్సిపాలిటీల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి లింగ్యానాయక్ సోమవారం ప్రకటించారు. ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిందని చెప్పారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్, డోర్నకల్, జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో సోమవారం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు ఏర్పాట్లు చేసినా, ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. నూతన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపట్టారు. అయితే, పలుచోట్ల ఉద్రిక్తతలు ఏర్పడటం, కొన్నిచోట్ల కోరం లేకపోవడంతో ఎన్నికలను వాయిదా వేసినట్లు లింగ్యానాయక్ తెలిపారు. ఎస్‌ఈసీ షెడ్యూల్ ప్రకారం ఈమున్సిపాలిటీల్లో మంగళవారం చైర్మన్, వైస్‌చైౖర్మన్ల ఎన్నికలు నిర్వహించాలని, ఒకవేళ ప్రక్రియ పూర్తిచేయలేకపోతే.. ఆయా కారణాలను తెలియజేయాలని సూచించారు.
నాటకీయ పరిణామాలు
ఈ మున్సిపాలిటీల్లో సోమవారంచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాతన్‌పల్లిలో అధికారులు నిర్ణయించిన ప్రమాణ స్వీకార సమయానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కార్యక్రమానికి చేరుకోలేదు. తమ కౌన్సిలర్లు ఈ ఎన్నికకు సమయానికి రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని బీఆర్‌ఎస్, సీపీఐ ఆరోపించాయి. కాగజ్‌నగర్‌లో సమావేశానికి 11 మంది బీఆర్‌ఎస్, ఒక ఎంఐఎం, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు హాజరై ప్రమాణం చేశారు. చైర్మన్ ఎన్నికకు 16 మంది సభ్యుల కోరం అవసరం కాగా, 14 మందే రావటంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. సుల్తానాబాద్‌లోని 15 వార్డుల్లో కాంగ్రెస్ 12 చోట్ల గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ చైర్మన్ అభ్యర్థి విషయంలో పార్టీలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఎన్నిక సాధ్యం కాలేదు. జనగామలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి చెరి 16 ఓట్ల బలం ఉంది. సోమవారం ప్రమాణస్వీకారానికి వస్తున్న సమయంలో 28వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను బీఆర్‌ఎస్ నేతలే కిడ్నాప్ చేశారని ఆమె భర్త, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను విచారించేందుకు పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. అయితే, ఫాతిమాను పల్లా కిడ్నాప్ చేశారని, ఈ కేసు తేలిన తర్వాతే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ చామల ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు నిరసనకు దిగటంతో గందరగోళం నెలకొంది.
దీంతో ఎన్నికను మంగళవారానికివాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకుగాను కాంగ్రెస్ 11 గెలిచి సంపూర్ణ మెజారిటీ సాధించినా, చైర్మన్ అభ్యర్థి విషయంలో పోటీ నెలకొనటంతో ఎన్నిక సాధ్యం కాలేదు. 24 వార్డులున్న ఇల్లెందు మున్సిపాలిటీలో ఇద్దరు స్వతంత్రులతో కలిసి కాంగ్రె్‌సకు 21మంది కౌన్సిలర్ల మద్దతు ఉన్నాహైదరాబాద్ క్యాంపు నుంచి వారు సమయానికి చేరుకోలేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 37స్థానాలకు కాంగ్రె్‌సకు20 ఓట్ల మెజారిటీ ఉన్నా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవటంతో ఎన్నికను వాయిదా వేశారు. ఇంద్రేశంలో 18వార్డులకుగాను స్వతంత్ర అభ్యర్థితో కలిపి బీఆర్‌ఎస్‌కు 10 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ పదవికి పోటీ నెలకొనటంతో ఎన్నిక సాధ్యం కాలేదు.
ఇబ్రహీంపట్నంలో టెన్షన్ టెన్షన్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చైర్మన్ ఎన్నికకు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరు కాలేదు. దీంతో అతడు వచ్చాకే ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. యాదగిరి భార్య వసంత, కుమారుడు టోని మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చి, తన భర్తను మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి (బంటి) కిడ్నాప్ చేశారని ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారటంతో ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి అనంతరెడ్డి మంగళవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంపైరాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలాయి. కిటికీ పక్కనే ఉన్న అనంతరెడ్డిచేతివేలికి స్వల్ప గాయమైంది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాళ్ల దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. నివేదిక అందించాలని అధికారులను ఆదేశించింది. మంగళవారం జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎస్‌ఈసీ పరిశీలకుడిని పంపి, స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించింది.