Share News

పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీర్యం చేయొద్దు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:04 AM

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలను ‘శక్తి’ (స్కిల్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇనీషియేటివ్స్‌) విభాగంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులు భగ్గుమంటున్నారు.

పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీర్యం చేయొద్దు

  • ‘శక్తి’లో విలీనాన్ని ఉపసంహరించుకోవాలి

  • రాష్ట్రంలో పలుచోట్ల పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళన

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆగస్టు 18: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలను ‘శక్తి’ (స్కిల్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇనీషియేటివ్స్‌) విభాగంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులు భగ్గుమంటున్నారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సంజయ్‌గాంధీ మెమోరియల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. వందలాది మంది విద్యార్థులు తరగతులు బహిష్కరించి హైవేను దిగ్బంధించడంతో ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్థంభించింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు లాగేశారు. ఒకరిద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని విద్యార్థులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని యూసు్‌ఫగూడ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ముందు విద్యార్థులు ఆలిండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(ఏఐడీఎ్‌సఓ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ‘సే నో టు ‘శక్తి’ అని నినాదాలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. కాగా, ‘విలీనం’తో తమ ప్రయోజనాలకు కూడా విఘాతం కలుగుతుందంటూ అధ్యాపకులు సైతం ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ పాలిటెక్నిక్‌ జేఏసీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు గురువారం నాలుగో రోజూ కొనసాగాయి.


లేటరల్‌ ఎంట్రీ లేకపోతే...

విద్యార్థులు మూడేళ్ల పాలిటెక్నిక్‌ పూర్తికాగానే ‘లేటరల్‌ ఎంట్రీ’ ద్వారా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌లో చేరుతున్నారు. ‘శక్తి’లో విలీనం తర్వాత లేటరల్‌ ఎంట్రీ లేకపోతే తమ ఉన్నత చదువులకు ద్వారాలు మూసుకుపోతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్‌లో చేరాలనుకుంటే మళ్లీ వెనక్కి వచ్చి ఇంటర్‌లో చేరాల్సి వస్తుందని, దీని వల్ల విలువైన కాలం వృథా అవుతుందంటున్నారు. పాలిటెక్నిక్‌ పూర్తయిన తర్వాత తమను స్కిల్డ్‌ లేబర్‌గా వాడుకోవాలని కార్పొరేట్‌ శక్తులు చూస్తున్నాయని, ఈ కుట్రలో భాగమే పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తిలో విలీనం చేయాలన్న నిర్ణయమని విమర్శిస్తున్నారు. కోర్సులను ప్రైవేటు వ్యక్తులు రూపొందిస్తే అవి పరిశ్రమల అవసరాలకే పరిమితమవుతాయంటున్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నందున భవిష్యత్తులో ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై విలీనానికి ముందే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, రేవంత్‌ ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో వేలాదిమంది పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు.


విద్యార్థినులతో ‘పింక్‌’ బ్యానర్‌ పట్టించారు!

జీవో 97ను వెంటనే రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌లోని మైనారిటీ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినులు గురువారం బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏ పార్టీ అయినా విద్యార్థులకు మద్దతుగా ఆందోళన నిర్వహిస్తే పార్టీ జెండాలు, బ్యానర్లను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే పట్టుకోవాలి. విద్యార్థులు కేవలం వారి డిమాండ్లు, నినాదాల ప్లకార్డులు మాత్రమే ప్రదర్శించాలి. కానీ, ఈ ధర్నాలో విద్యార్థినులతో బీఆర్‌ఎ్‌సవీ ‘పింక్‌’ బ్యానర్‌ పట్టించారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Aug 21 , 2026 | 06:05 AM