పాలిసెట్ అభ్యర్థులకు పరేషాన్!
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:31 AM
పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు పరేషాన్ తప్పలేదు. మంగళవారం ఉదయం నుంచే సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
సర్వర్ డౌన్‌తో తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు ఆటంకం
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో అభ్యర్థులు, తల్లిదండ్రుల పడిగాపులు
హైదరాబాద్ సిటీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు పరేషాన్ తప్పలేదు. మంగళవారం ఉదయం నుంచే సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్ నిమిత్తం హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం పూట స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సాయంత్రం వరకు ధ్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తికాకపోవడం, మరోవైపు మధ్యాహ్నం స్లాట్‌లు బుక్ చేసుకున్న అభ్యర్థులు సైతం హెల్ప్‌లైన్ కేంద్రాలకు చేరుకోవడంతో ఆయా సెంటర్లలో తీవ్ర రద్దీ ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 70 హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని కేంద్రాల్లో ఎంతకీ సర్వర్ పనిచేయకపోవడంతో వందల మంది అభ్యర్థులు ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం 3,381 మంది పాలిసెట్ అభ్యర్థులు తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయించుకున్నారని సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు బుధవారంలోగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 20లోగా తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.