Share News

వ్యవసాయ విద్యుత్తు లెక్క తేల్చాలంటే..100 శాతం వ్యవసాయ ఫీడర్లను విభజించాల్సిందే

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:37 AM

కచ్చితమైన వ్యవసాయ విద్యుత్తు వినియోగం లెక్కతేలాలంటే వ్యవసాయ ఫీడర్ల విభజన 100 శాతం జరగాలని ఆడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా...

వ్యవసాయ విద్యుత్తు లెక్క తేల్చాలంటే..100 శాతం వ్యవసాయ ఫీడర్లను విభజించాల్సిందే

  • సుస్థిర రైతు డిస్కమ్‌ ఏర్పాటుపై సమావే శంలో ఆస్కి

  • జూన్‌ 2నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు: సీఎండీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కచ్చితమైన వ్యవసాయ విద్యుత్తు వినియోగం లెక్కతేలాలంటే వ్యవసాయ ఫీడర్ల విభజన 100 శాతం జరగాలని ఆడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(ఆస్కి) సూచించింది. వ్యవసాయ పంపుసెట్లు ఏ మేరకు కరెంట్‌ను వినియోగిస్తున్నాయి.. ఎత్తిపోతల పథకాలకు ఎంత... మిషన్‌ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా మోటార్లు ఏ మేరకు వాడుతున్నాయో లెక్కలు వెల్లడికావాల్సి ఉందని పేర్కొంది. రైతు డిస్కమ్‌ పరిధిలోని డీటీఆర్‌ (పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు)లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించడంతో ఫీడర్ల విభజన సైతం పూర్తిస్థాయిలో జరగాలని పేర్కొంది. రాష్ట్రంలో 29 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ/వాటర్‌బోర్డు పథకాల కనెక్షన్లతో రైతు డిస్కమ్‌ ఏర్పాటు కానున్న విషయం విదితమే. దీన్ని సుస్థిరంగా, సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఏయేచర్యలు తీసుకోవాలనే అంశంపై ఆడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(ఆస్కి)తో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టారు. ఈమేరకు గురువారం ఆస్కి ప్రతినిధులతో రైతు డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఇతర అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుత విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి నెట్‌వర్క్‌ బదిలీ, ఆస్తుల గుర్తింపు, విలువ, పారదర్శకంగా విభజన, సాంకేతిక, ఆర్థికపరమైన ప్రభావాలు చర్చకు వచ్చాయి. ఉద్యోగుల కేటాయింపు, నైపుణ్యాల ఆధారంగా విభజన, శిక్షణ, సేవ నిబంధనల రూపకల్పన ముసాయిదాను రూపొందించారు. కాగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పూర్తిస్థాయిలో రైతు డిస్కమ్‌ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు సీఎండీఫారూఖీ ప్రకటించారు.

తెలంగాణ దారిలోనే హర్యానా, మహారాష్ట్ర

తెలంగాణ దారిలోకే హర్యానా, మహారాష్ట్ర అడుగుపెట్టనున్నాయి. ప్రస్తుతం హర్యానాలో ఉత్తర్‌ హర్యానా బిజ్లీ వితరణ్‌ నిగమ్‌, దక్షిణ్‌ హర్యానా బిజ్లీ వితరణ్‌ నిగమ్‌లు ఉన్నాయి. ఈ రెండింటిలో నుంచి వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేకంగా విద్యుత్‌ అందించడానికి వీలుగా రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. ఇక మహారాష్ట్రలో.. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎంఎ్‌సఈడీసీఎల్‌) ఉంది. దీన్ని వేరుచేస్తూ ప్రత్యేకంగా రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - Apr 10 , 2026 | 05:38 AM