మొరాయిస్తున్న రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్
ABN , Publish Date - May 25 , 2026 | 05:15 AM
పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా భావించే తెలంగాణ పోలీసు వెబ్‌సైట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇందులోని పలు ఫీచర్ల ద్వారా సమాచారం పొందేందుకు వీల్లేకుండా సాంకేతిక ఇబ్బందులు ...
ఎఫ్‌ఐఆర్ డౌన్‌లోడ్‌లో తిప్పలు
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా భావించే తెలంగాణ పోలీసు వెబ్‌సైట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇందులోని పలు ఫీచర్ల ద్వారా సమాచారం పొందేందుకు వీల్లేకుండా సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఫిర్యాదుదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలీసుశాఖను డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో.. వివిధ పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలకు చెందిన ఠాణాల్లో నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌ను.. ఫిర్యాదుదారు ఇంటి వద్దనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు వ్యూ ఎఫ్‌ఐఆర్ అప్షన్ పెట్టారు. అలాగే తన కేసు దర్యాప్తు పరిస్థితిని సైతం నో యువర్ కేస్ స్టేటస్ బటన్ ద్వారా తెలుసుకోవచ్చు. కొంతకాలంగా ఎఫ్‌ఐఆర్ డౌన్‌లోడ్ కోసం ప్రయత్నిస్తుంటే పీడీఎఫ్ డాక్యుమెంట్ తెరుచుకోవడం లేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎఫ్‌ఐఆర్‌ను పీడీఎఫ్ ఫార్మేట్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరగొచ్చని, సంబంధిత అధికారి అది డౌన్‌లోడ్ అవుతోందా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వెబ్‌సైట్‌లో లోపాలను సరిదిద్దాలంటూ పలు వినతులు వారికి చేరుతున్నాయి.