Share News

మహిళలు, పిల్లలు.. ఇంటివద్దే ఫిర్యాదు చేయొచ్చు

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:24 AM

శారీరక, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర పోలీసు శాఖ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది.

మహిళలు, పిల్లలు.. ఇంటివద్దే ఫిర్యాదు చేయొచ్చు

  • దాడులకు గురైనప్పుడు ఠాణాకు వెళ్లాల్సిన అవసరం

  • లేకుండా తెలంగాణ పోలీసు శాఖ కొత్త నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శారీరక, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర పోలీసు శాఖ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. బాధితులు కోరుకున్నచోటుకే పోలీసులు వెళ్లి, వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ విప్లవాత్మక మార్పును తీసుకొస్తున్నట్టు ఆమె తెలిపారు. దాడులకు గురైన మహిళలు, పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని గుర్తించామని, పోక్సో కేసుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని ఆమె వివరించారు. బాల్య వివాహల నిరోధక చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించిన ఫిర్యాదులు, ర్యాగింగ్‌ ఫిర్యాదులను సైతం బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి నమోదు చేసుకోవడం ద్వారా న్యాయప్రక్రియను వేగవంతం చేయగలుగుతామని, బాధితులకు భరోసా కల్పించగలుగుతామని ఆమె తెలిపారు. కొత్త విధానం ప్రకారం.. నేరం జరిగినపుడు బాధితులు ఫోన్‌ లేదా మౌఖికంగా పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇస్తే సరిపోతుంది. వెంటనే సంబంధిత పోలీసు అధికారి బాధితుల నివాసానికి/ఘటనా స్థలానికి (లేదా) బాధితులు చికిత్స పొందుతుంటే ఆసుపత్రులకు చేరుకుంటారని ఆమె వివరించారు. వారి నుంచి ఫిర్యాదును స్వీకరించి వెంటనే పోలీసు స్టేషన్‌కు పంపించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయిస్తారని, ఆపై ఎఫ్‌ఐఆర్‌ కాపీని బాధితుల ఇంటి వద్ద అందజేస్తారని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే తమ పరిధి కాకున్నా ఆయా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని, అలా ఎవరైనా తిరస్కరిస్తే వారిపై చర్యలుంటాయని చారుసిన్హా హెచ్చరించారు.

Updated Date - Jan 21 , 2026 | 05:24 AM