పోలీసులకు శుభవార్త
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:55 AM
తెలంగాణ పోలీసుశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి తీపికబురు అందించారు. వారికి పుట్టినరోజుతో పాటు పెళ్లిరోజు నాడు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పుట్టిన రోజు, పెళ్లి రోజున ప్రత్యేకసెలవులు
హైదరాబాద్/రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి ): తెలంగాణ పోలీసుశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి తీపికబురు అందించారు. వారికి పుట్టినరోజుతో పాటు పెళ్లిరోజు నాడు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు నిరంతరం విధుల్లో తీవ్ర ఒత్తిడితో పనిచేస్తూ, వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నారని.. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా.. అన్ని యూనిట్ అధికారులు తప్పనిసరిగా ఈ సెలవులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. డీజీపీ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు పోలీసుల సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీలోని టీజీఐఐసీ భవనంలో ఫ్యూచర్ సిటీ తాత్కాలిక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం మీర్‌ఖాన్‌పేట్‌లో 24ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, నిర్మాణానికి రూ.25 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.
డీజీపీకి ఘనంగా వీడ్కోలు సమావేశం
ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న డీజీపీ బి. శివధర్ రెడ్డికి టీఎన్‌జీవోస్ యూనియన్ డీజీపీ కార్యాలయ యూనిట్ ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. డీజీపీ మృదుభాషి, సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తి అని, అవసరమైన సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునే అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అనంతరం శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ హోదాలో పనిచేసినా ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేశానని తెలిపారు. డీజీపీ కార్యాలయంలో 7ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవంతో, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా బిజినెస్ రూల్స్‌పై మార్గదర్శక పుస్తకాన్ని సిద్థం చేశామని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇంటెలిజెన్స్ అధికారులలో శివధర్‌రెడ్డి ఒకరని శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం. భగవత్ అన్నారు.