కానిస్టేబుల్ అయినా.. ఐపీఎస్ అయినా.. తప్పు చేస్తే వేటే
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:41 AM
కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకూ.. అవినీతి ఆరోపణలు వచ్చిన వారెంతటివారైనా వదిలిపెట్టేది లేదని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
జవాబుదారీతనంతో కూడిన పోలీసు వ్యవస్థకు శ్రీకారం
ఆధునిక పోలీసింగ్.. ప్రతి ఠాణాలో సైబర్ సోల్జర్స్
కీలక విభాగాల్లో ఉన్నత విద్యావంతులైన పోలీసులు
సీఎం ఆదేశాలతో పోలీసుశాఖలో పునర్వ్యవస్ధీకరణ
‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకూ.. అవినీతి ఆరోపణలు వచ్చిన వారెంతటివారైనా వదిలిపెట్టేది లేదని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టామని.. జవాబుదారీనంతో కూడిన పోలీసింగ్‌ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బంది విద్యార్హతలను పరిశీలించి, ఉన్నత విద్యావంతులైనవారికి కొత్తగా ఏర్పాటు చేస్తున్న సాంకేతిక విభాగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కానిస్టేబుల్స్, ఎస్సైల్లో పీజీలు, డబుల్ పీజీలు చేసినవారున్నారని.. ఆధునిక సాంకేతిక పోలీసింగ్‌లో వారి సేవలు కీలకం కాబోతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీజీపీ పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు
పోలీసుశాఖ పునర్‌వ్యవస్థీకరణ ఎలా చేస్తున్నారు?
ఎన్నో ఏళ్ల నాటి విధివిధానాలు, నిబంధనలను ఒకదాని తర్వాత ఒకటిగా మార్చుకుంటూ.. ఆధునిక సాంకేతిక పోలీసింగ్ వైపు ప్రయాణించాల్సిన సమయం వచ్చింది. డిగ్రి, పీజీ చేసిన వారు సైతం కానిస్టేబుళ్లుగా సాధారణ విధులు నిర్వహిస్తున్నారు. ఇకపై వీరిని యూనిట్లవారీగా గుర్తించి పోలీసుశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన టీ సేఫ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ట్రాఫిక్ విభాగాల్లో చదువుకు తగిన పని అప్పగించనున్నాం. ఇటీవల గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ నుంచి సిబ్బంది బదిలీ చేపట్టినపుడు దాదాపు 80మంది ఎమ్మెస్సీ, బీఎస్సీ, బీ ఫార్మసీ తదితర సైన్స్ విభాగాల్లో చదివిన వారున్నట్టు తేలింది. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆహర కల్తీ నిరోధక విభాగమైన ‘టీ సేఫ్’లో నియమించాం. అక్కడ సైన్స్ సంబంధిత సబ్జెక్టులు చదివిన వారి అవసరం చాలా ఉంది.
కొంతమంది పోలీసులెప్పుడూ అటాచ్‌మెంట్ విధుల్లోనే ఉంటున్నారు? అది అవసరమా?
అటాచ్‌మెంట్ విధానాన్ని రద్దు చేస్తున్నాం. ఎక్కడికక్కడ అదనపు సిబ్బంది అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కేటాయిస్తున్నాం. దీంతో స్టేషన్ స్ధాయిలో మాన్‌పవర్ బాగా అందుబాటులోకి వస్తోంది.
విజిబుల్ పోలీసింగ్‌కు ప్రయారిటీ అని మీరంటున్నారు? కానీ.. క్షేత్రస్థాయిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా?
పోలీసింగ్‌లో కనిపించని పోలీసులు సీసీ కెమెరాలు. కానీ,క్షేత్రస్థాయిలో కన్పిస్తేనే పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరూ రోజూ సాయంత్రం 3 నుంచి 5గంటల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చాం. ఏ అధికారైనా అలా ఉండకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అలాగే.. ప్రతి పోలీసు అధికారీ తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా ఆదేశాలిచ్చాం. శాఖలో కీలకమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు విజిటింగ్ అవర్స్‌లో తాము అటెండ్ చేసిన ఫిర్యాదుల సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని ఆదేశాలివ్వడంతో ప్రతి ఫిర్యాదూ ఉన్నతాధికారుల నోటీసులోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో కేసుల దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సీసీటీఎన్‌ఎ్‌స ప్రాజెక్టులో ప్రతి పోలీసు స్టేషన్‌కూ వచ్చే ఫిర్యాదులు, చర్యలు, అరెస్టులు ఇతర వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ద్వారా పేపర్‌లెస్ పాలనతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణకు మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది.
సైబర్ నేరాల కట్టడికి తీసుకునే చర్యలేంటి?
కనిపించని శత్రువుతో చేసే యుద్ధం అది. రాష్ట్రంలో నమోదవుతున్న ప్రతి నాలుగు ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి సైబర్ నేరాలకు సంబంధించినది అవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సంప్రదాయ పోలీసింగ్‌తో సైబర్ నేరగాళ్లను ఎదుర్కోలేం. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడం, పోలీసుశాఖలో సైబర్ వారియర్స్‌ను రూపొందించుకోవడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేరాల స్వరూపం మారుతున్న వేళ పోలీసులు తమను తాము మార్చుకోవాల్సిన పరిస్ధితులు వచ్చాయి. అందుకే.. ప్రతి పోలీసు స్టేషన్‌లో టెక్నాలజీ పట్ల అవగాహన ఉండి, ఉన్నత విద్యార్హతలు ఉన్న హోంగార్డులు, కానిస్టేబుళ్లను సైబర్ సోల్జర్స్‌గా నియమిస్తున్నాం. వీరికి ప్రాధమికంగా రెండు నెలలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా శిక్షణ ఇప్పించి క్షేత్రస్ధాయికి పంపుతున్నాం. భవిష్యత్తులో ప్రతి ఠాణాలో క్రైం ఎస్సై స్ధానంలో సైబర్ క్రైం ఎస్సైలు రానున్నారు.
ఇటీవల మీరు నిర్వహించిన మెగా టెలికాన్ఫరెన్స్ వల్ల ప్రయోజం ఉందా?
పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 6,750 మంది సబ్ ఇన్‌స్పెక్టర్, ఆ పై స్ధాయి అధికారులతో ఇటీవల మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం. పోలీసింగ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచనల గురించి క్షేత్రస్థాయి అధికారులకు వివరించడంతో పాటు 39 అంశాలపై వారికి అవగాహన కల్పించాం. శాఖలో కింది స్ధాయి అధికారి అయిన సబ్ ఇన్‌స్పెక్టర్‌తో డీజీపీగా నేను స్వయంగా మాట్లాడి లక్ష్యాన్ని వివరించడం ద్వారా వారిలో విధి నిర్వహణ పట్ల మరింత బాధ్యత పెరుగుతోంది.
అవినీతి ఆరోపణలు, పోలీసు ఆత్మహత్యలు.. ఎలా అధిగమిస్తారు?
విధి నిర్వహణలో అత్యంత ప్రాథమిక అంశమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్‌వోపీ) ప్రతి పోలీసు అధికారీ అమలు చేస్తే ఫిర్యాదులకు అవకాశమే ఉండదు. స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ఎవరొచ్చినా దాన్ని తీసుకుని.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి వాదనను పూర్తిగా వని, ఆధారాలను పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా.. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారెంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా.. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చినా విచారణ జరిపి కఠినచర్యలు తీసుకుంటాం. సిబ్బందిలో కొందరు వివిధ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేస్తోంది. వాస్తవానికి స్టేషన్‌లోని ప్రతి పోలీసుతో ఎస్‌హెచ్‌వోలు కుటుంబపెద్దలా మాట్లాడాలి. డ్యూటీ పరంగాగానీ, వ్యక్తిగతంగాగానీ సమస్యలేవైనా ఉన్నట్టు గుర్తిస్తే.. వాటిని పరిష్కరించడానికి యత్నించాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇన్‌స్పెక్టర్ ఒక పెద్దన్న లాగా వ్యవహరించినపుడు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒకరున్నారనే భరోసా కలిగి.. సిబ్బంది ఆత్మహత్య ఆలోచనలకు దూరం అవుతారు.