సైబర్ నేరాల సవాళ్లు ‘స్మార్ట్’గా తెలంగాణ పోలీసులు
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:49 AM
నేరాల స్వరూపం మారిపోతుండటంతో.. పోలీసు దర్యాప్తును సైతం సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకు..
కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు ఆధునిక సాంకేతిక ప్రత్యేక శిక్షణ
పోలీసు అకాడమీలో కొత్త తరహా తర్ఫీదు
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నేరాల స్వరూపం మారిపోతుండటంతో.. పోలీసు దర్యాప్తును సైతం సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకు.. తెలంగాణ పోలీసు అకాడమీలో ఇటీవల కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ, శాస్ర్తీయ దర్యాప్తు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ పోలీసులు ముందడుగు వేస్తున్నారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సైబర్ నిపుణుల కోసం నిరీక్షించకుండా అందుబాటులోని సాంకేతిక వనరులను వేగంగా వినియోగించుకునే తీరుపై కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు పోలీసు అకాడమీలో కొత్త తరహా తర్ఫీదు ఇస్తున్నారు. కాల్ డిటైల్ రికార్డులు(సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డు(ఐపీడీఆర్), టవర్ డంప్ విశ్లేషణ, సోషల్ మీడియా ప్రొఫైలింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్ అనాలసిస్ తదితర ఆధునిక అంశాలపై శిక్షణ కొనసాగుతోందని అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ తెలిపారు. కాగా, పోలీసు అకాడమీలో గురువారం స్టాక్ మార్కెట్‌పై అవగాహన, పెట్టుబడి మోసాల నివారణపై సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించాయి. శిక్షణ పొందుతున్న డీఎస్పీలు, వివిధ విభాగాలకు చెందిన ఇతర శిక్షణార్థులు ఇందులోపాల్గొన్నారు.