Share News

పోలీసింగ్‌లోనూ ఏఐ వాడకం

ABN , Publish Date - May 24 , 2026 | 05:19 AM

రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు కన్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం ‘విజిబుల్‌ పోలీసింగ్‌’లో ఒక భాగం. ఇకపై పోలీసులు తక్కువగా కన్పిస్తూ సాంకేతికత అండతో నేరం జరిగిన కొద్ది క్షణాల్లోనే...

పోలీసింగ్‌లోనూ ఏఐ వాడకం

  • డీజీపీ కార్యాలయంలో టెక్‌ టీమ్‌ ఏర్పాటు

  • ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు బాధ్యతలు

  • ఒకే యాప్‌లో పోలీసు సేవలు, విచారణ

  • ఐటీ, ఏఐపై డీజీపీ సీవీ ఆనంద్‌ సమీక్ష

హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు కన్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం ‘విజిబుల్‌ పోలీసింగ్‌’లో ఒక భాగం. ఇకపై పోలీసులు తక్కువగా కన్పిస్తూ సాంకేతికత అండతో నేరం జరిగిన కొద్ది క్షణాల్లోనే మన ముందుండటం, నేరం జరిగే పరిస్థితులు కన్పిస్తే నిమిషాల్లో అడ్డుకోవడం ‘ఇన్విజిబుల్‌ పోలీసింగ్‌’ ప్రత్యేకత. పలు దేశాలు అనుసరిస్తున్న ఈ విధానం దిశగా దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొంటున్న కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా వినియోగించేలా రాష్ట్ర పోలీసులు కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఏఐ వినియోగాన్ని మెరుగుపరుచుకుంటూ పరిశోధనలో పోలీసులు ఉపయోగిస్తున్న వివిధ సాంకేతిక వేదికలను ఒకే తాటిపై తీసుకుని రావడానికి డీజీపీ కార్యాలయంలో టెక్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన ఈ టెక్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉండి స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువ పోలీసు సిబ్బందిని ఈ బృందంలో చేర్చుకుంటామని తెలిపారు. తెలంగాణ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌తో పాటు నేర పరిశోధనలో పోలీసులు ఉపయోగిస్తున్న హాక్‌ ఐ, సీసీటీఎన్‌ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ లాంటి అన్ని సాంకేతిక వేదికలు ఒకే ఉమ్మడి వ్యవస్థ కింద పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు దర్యాప్తులో కీలకమైన సీసీటీఎన్‌ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వ్యవస్థలను అనుసంధానిస్తూ టీఎస్-కాప్స్‌ పేరిట ఒక ఉమ్మడి మొబైల్‌ ప్లాట్‌ఫాం రూపొందించాలని సూచించారు. ఏఐ ఆధారిత ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి వీలుగా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులతో కోర్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో ఐపీఎస్‌ అధికారికి ఒక్కో బాధ్యత అప్పగించారు. హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్వేతకు సీసీటీఎన్‌ఎస్-2.0 అభివృద్ధి, హెచ్‌ఆర్‌ఎంఎస్ పర్యవేక్షణతో పాటు సీఐడీ విభాగంతో సమన్వయం చేసుకునే బాధ్యత అప్పగించారు. సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో ఏఐ సాంకేతికను అనుసంధానించే బాధ్యతను డీఐజీ భాస్కరన్‌కు, సోషల్‌ మీడియా, వీడియో అనలిటిక్స్‌, ఏఐ ఆధారిత డ్రోన్‌ టెక్నాలజీ పర్యవేక్షణ బాధ్యతను డీసీపీ రూపేష్ కు, రహదారి భద్రత మాడ్యుళ్లను అవినాష్‌ మహంతికి, డాటా ఇంటెలిజెన్స్‌, సిస్టమ్‌ డిజైనింగ్‌, శిక్షణ కార్యక్రమాల బాధ్యతను ఎస్పీ అపూర్వారావుకు అప్పగించారు.

Updated Date - May 24 , 2026 | 05:19 AM