Share News

ఇన్‌చార్జిల పాలనలో పోలీసు విభాగాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 07:05 AM

పోలీసు శాఖలో కొన్నేళ్లుగా కొందరు అధికారులు అవే స్థానాల్లో పాతుకుపోవడం, ఒకే అధికారికి పలు బాధ్యతలు అప్పగించడంతో కీలక కేసుల దర్యాప్తు అటకెక్కుతోంది.

ఇన్‌చార్జిల పాలనలో పోలీసు విభాగాలు

  • ఏళ్ల తరబడి ఒకే అధికారికి పలు బాధ్యతలు

  • పర్యవేక్షణాలోపం.. పెండింగ్‌లో కీలక కేసులు

  • ఆరుగురు డీజీలు ఉన్నా సర్దుబాటులో వైఫల్యం

హైదరాబాద్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో కొన్నేళ్లుగా కొందరు అధికారులు అవే స్థానాల్లో పాతుకుపోవడం, ఒకే అధికారికి పలు బాధ్యతలు అప్పగించడంతో కీలక కేసుల దర్యాప్తు అటకెక్కుతోంది. కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమించక ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తుండడంతో కిందిస్థాయిలో ఏం జరుగుతోందో పర్యవేక్షించలేని దుస్థితి. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నుంచి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) వరకు ఇన్‌చార్జిల పాలన నడుస్తోంది. పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్‌ వ్యవహరిస్తుండగా డీజీపీ ర్యాంకులో శిఖాగోయల్‌, మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, సౌమ్యా మిశ్రా, చారుసిన్హా, సజ్జనార్‌, అనిల్‌ కుమార్‌ ఉన్నారు. డీజీపీ ఆపరేషన్స్‌ విభాగాన్ని అనిల్‌ కుమార్‌, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డుతో పాటు డీజీపీ టెక్నికల్‌ సర్వీసెస్‌ విభాగాన్ని వీవీ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. లా అండ్‌ అర్డర్‌ విభాగం డీజీపీగా మహేశ్‌ భగవత్‌ పనిచేస్తున్నారు. డీజీపీ ఆర్గనైజేషన్స్‌, హోంగార్డుల విభాగాన్ని స్వాతి లక్రా పర్యవేక్షిస్తుండగా సీఐడీ డీజీపీగా చారుసిన్హా, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష్‌ బిస్త్‌, హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్‌, హైదరాబాద్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ పనిచేస్తున్నారు. సీఎస్‌బీ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన శిఖా గోయల్‌ను గత నెలలోనే హోం శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ పోస్టులో విస్తృత బాధ్యతలు ఉన్నప్పటికీ అదనంగా సీఎస్‌బీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్‌) విభాగాలకూ ఆమెనే కొనసాగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణా లోపానికి ఆస్కారం ఉంటుందని మాజీ పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.


దీనికి ఉదాహరణే ఇటీవల బయటపడిన సీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ లంచం వ్యవహారమని, ఏసీపీకే రూ.30 లక్షలు ఇవ్వాలని ఆ ఇన్స్పెక్టర్ అనగలిగారంటే అక్కడ ఏం జరుగుతోందనే విషయాలపై ఉన్నతాధికారి పర్యవేక్షణాలోపం స్పష్టంగా కన్పిస్తుందని పేర్కొంటున్నారు. సీఎస్‌బీని దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు సూచించినా ఒకే అధికారి ఏళ్ల తరబడి కొనసాగడం విమర్శలకు తావిస్తోంది. కేసుల దర్యాప్తులో అత్యంత కీలకమైన ఎఫ్‌ఎస్ఎల్‌కు కొన్నేళ్లుగా పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించడం లేదు. ఈ విభాగంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విభాగానికి ఫోరెన్సిక్‌ సైన్స్‌లో అనుభవమున్న వ్యక్తిని డైరెక్టర్‌గా నియమిస్తారు. కానీ ఈ విభాగం బాధ్యతలను కొన్నేళ్లుగా శిఖా గోయల్‌ నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో అత్యంత కీలకమైన సీఐడీ డీజీపీ పోస్టులో గతంలో ఇన్‌చార్జిలను నియమించినా ఇటీవల చారుసిన్హాకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే సీఐడీ అధికారులు వేలాది కేసుల దర్యాప్తులో నిమగ్నమై ఉండగా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, హెచ్‌సీఏ అక్రమాలు, మైనింగ్‌ మాయాజాలానికి సంబంధించిన ప్రత్యేక సిట్‌ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు చారుసిన్హా రాష్ట్ర మహిళా భద్రతా విభాగం బాధ్యతలు కూడా చూడాల్సిన పరిస్థితి. విపరీతమైన పని ఒత్తిడితో ఉండే చారుసిన్హాకు అదనంగా ఏసీబీ ఇన్‌చార్జి పోస్టు కూడా ఇవ్వడం చర్చనీయాంశమైంది. డీజీపీ స్థాయి పోస్టుల సర్దుబాటుపై ఇటీవల సీఎం సైతం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి అధికారులను నియమించకపోవడానికి ఉన్నత స్థాయిలో ఐపీఎస్‌ల కొరత ఒక కారణమని సీనియర్‌ అధికారులు అంతర్గతంగా పేర్కొంటున్నా ఒత్తిళ్లు మరో కారణంగా కన్పిస్తున్నాయని చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 08 , 2026 | 07:06 AM