పోలీసు కానిస్టేబుళ్లకు శుభవార్త
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:20 AM
తెలంగాణ పోలీసుశాఖలో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పదోన్నతుల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు...
త్వరలో 15,582 మందికి పదోన్నతులు!
ప్రభుత్వానికి పోలీస్ శాఖ కీలక ప్రతిపాదన
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసుశాఖలో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పదోన్నతుల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి సుమారు 15,582 మందికి ఒకేసారి పదోన్నతులు దక్కేలా పోలీసుశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపింది. దీనిలో భాగంగా.. కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్ ఆపై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల స్థాయి పదోన్నతుల నిష్పత్తి 13-3-1 నుంచి 4-2-1కి తగ్గించాలని పోలీసుశాఖ ప్రతిపాదించింది. ఈ కొత్త 4-2-1నిష్పత్తి అమల్లోకి వస్తే తక్కువకాలంలోనే పదోన్నతులు పొందే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న 13-3-1నిష్పత్తి వల్ల చాలామంది కానిస్టేబుళ్లు దశాబ్దాల పాటు ఒకే హోదాలో కొనసాగాల్సి వస్తోంది. సివిల్ కానిస్టేబుల్‌కు తొలి ప్రమోషన్ రావడానికి 16 నుంచి 27 సంవత్సరాలు, రెండో పదోన్నతి రావడానికి 8 నుంచి 11ఏళ్లు పడుతోంది. ఏఆర్ కానిస్టేబుల్‌కు అయితే 13 నుంచి 24 ఏళ్లు, ఎస్‌ఏఆర్, సీపీఎల్ విభాగంలో రిక్రూట్ అయిన వారికి తొలి పదోన్నతి 30 ఏళ్లు పడుతోంది. కానిస్టేబుల్‌గా డ్యూటీలో చేరి అదే స్థాయిలో రిటైర్ అవుతున్న అనేక మంది తమ ఆవేదనను డీజీపీ శివధర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ జాప్యం వల్ల సిబ్బంది తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని గుర్తించిన డీజీపీ దీనికి చెక్‌పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ వల్ల పోలీసుశాఖపై రూ.71.30 కోట్లు అదనపు భారం పడుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.