Share News

సమర్థ పోలీసింగే లక్ష్యం

ABN , Publish Date - May 31 , 2026 | 06:01 AM

పోలీసు శాఖలో జవాబుదారీతనం పెంపొందించి, అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించడంతోపాటు సమర్థవంతమైన పోలీసింగ్‌ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ......

సమర్థ పోలీసింగే లక్ష్యం

  • ప్రతి పోలీసు ప్రజలకు అందుబాటులో ఉండాలి

  • త్వరలోనే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ సేఫ్టీ బ్యూరో

  • ఆహార కల్తీ నిరోధక విభాగం

  • సైబర్‌ క్రైం, నార్కోటిక్‌ విభాగాలను బలోపేతం చేస్తాం

  • మహిళలు, పిల్లల భద్రతకు పెద్ద పీట: డీజీపీ సీవీ ఆనంద్‌

  • సీఐ నుంచి కమిషనర్‌ వరకు అందరితో వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో జవాబుదారీతనం పెంపొందించి, అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించడంతోపాటు సమర్థవంతమైన పోలీసింగ్‌ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌శాఖ పనితీరులో మార్పు రావాలని ప్రభుత్వం ఆశిస్తోందని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అవినీతి వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో శనివారం ఆయన ‘సమర్థవంతమైన పోలీసింగ్‌-ప్రమాణాల అవలంబన’ అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండున్నర గంటలు పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ నక్సల్స్‌ ప్రభావం దాదాపుగా తగ్గిన నేపధ్యంలో గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ వంటి ప్రత్యేక విభాగాలను పునః సమీక్షించి, వాటిని పునర్వ్యవస్థీకరించే సమయం వచ్చిందని తెలిపారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల (నార్కోటిక్స్‌)ను అడ్డుకునేందుకు, సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ఆయా విభాగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. ట్రాఫిక్‌ నిర్వహణ, రహదారి భద్రతా ప్రమాణాల అమలుకు త్వరలోనే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


అలాగే, ప్రజారోగ్య రక్షణ కోసం ఆహార కల్తీ నిరోధక విభాగం(ఫుడ్ అడల్ట్రేషన్ వింగ్‌), ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూసేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రత, బాలల అక్రమ రవాణా నిరోధానికి పెద్దపీట వేయాలని సూచించారు. భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. సాంకేతిక వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీఐడీ డీజీ, టెక్నికల్‌ సర్వీసెస్‌ డీజీ పర్యవేక్షణలో యువ ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేకంగా డీజీపీ టెక్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డేటా విశ్లేషణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ‘హాక్‌ ఐ అల్ర్టా’, ‘టీజీ-కాప్‌ అల్ర్టా’ వంటి అధునాతన అప్లికేషన్లను ప్రవేశపెడతామన్నారు. పోలీస్‌ శాఖలో అంతర్గత క్రమశిక్షణ కీలకమని, కింది స్థాయి అధికారులు ఎల్లప్పుడూ పైఅధికారులకు గౌరవం ఇస్తూ, తోటి సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. అధికారులు కేవలం పర్యవేక్షకులుగా కాకుండా నిజమైన నాయకులుగా పని చేయాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు ప్రతి నెలా 15వ తేదీ లోపు క్రైం రివ్యూ (నేరాల సమీక్ష) సమావేశాలు నిర్వహించాలని, ఆ నివేదికలను అదే నెల 20వ తేదీలోపు డీజీపీ కార్యాలయానికి, సీఐడీకి పంపాలని ఆదేశించారు. జిల్లాల్లో అధికారుల పనితీరును పర్యవేక్షించి, మార్గదర్శకత్వం చేయడానికి నలుగురు డీఐజీలను నియమించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ప్రతి పోలీస్‌ యూనిట్‌ అధికారి ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల కోసం సమయాన్ని కేటాయించాలని ఆదేశించారు. పోలీసు సిబ్బందికి సంబంధించిన రూ.6,000 కోట్ల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఇతర బకాయిలపై ఇటీవలే ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.2,000 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ.4,000 కోట్లను త్వరలో విడతల వారీగా విడుదల చేస్తారని వెల్లడించారు. ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అన్ని ప్రయోజనాలు అందుతాయని భరోసా ఇచ్చారు. సమావేశంలో డీజీలు మహేష్‌ ఎం భగవత్‌, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా.. ఆయా విభాగాల పనితీరును వివరించారు.

Updated Date - May 31 , 2026 | 06:01 AM