Share News

ఏసీబీ వలలో మహిళా సీఐ, ఎస్‌ఐ

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:36 AM

విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి పదేపదే చెప్తున్నా మారని కొందరి తీరు పోలీసుశాఖకు మచ్చ తెస్తోంది..

ఏసీబీ వలలో మహిళా సీఐ, ఎస్‌ఐ

  • డీజీపీ చెప్పినా మారని పోలీసుల తీరు

  • నెల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడ్డ 8 మంది

హైదరాబాద్‌, వికారాబాద్‌, ఏప్రిల్‌21(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి పదేపదే చెప్తున్నా మారని కొందరి తీరు పోలీసుశాఖకు మచ్చ తెస్తోంది. తాజాగా వికారాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ వలలో చిక్కారు. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరింది. రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌, బాధితుల వివరాల ప్రకారం.. తాండూరుకి చెందిన ఇర్షాద్‌పై అతని భార్య 498ఏ కింద కేసు పెట్టింది. దీంతో వరకట్నవేధింపుల కేసుకు సంబంధించి ఆరుగురికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి రూ.60 వేల లంచాన్ని వికారాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ సరోజ, ఎస్‌ఐ రాణి డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని బాధిత కుటుంబం బతిమాలడంతో ఆ మొత్తాన్ని రూ.40వేలకు తగ్గించారు. ఈ క్రమంలో తొలివిడతగా గత నెల 23న మహిళా పోలీసుస్టేషన్‌లో సీఐకు బాధితుడు రూ.20వేలు అందచేశారు. మిగతా డబ్బు ఇవ్వలేక పోవడంతో అతనికి పోలీసు అధికారులు ఫోన్లు చేసి బెదిరించసాగారు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో మంగళవారం బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తున్న సమయంలో సీఐ, ఎస్‌ఐలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ సరోజ, ఎస్‌ఐ రాణిలపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత నెల 23న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మాజీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాత కేసుకు సంబంధించి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెల 26న నిర్మల్‌ జిల్లా మామడ ఎస్‌ఐ అశోక్‌ రూ.20 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత నెల 30న నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీ పేట ఎస్‌ఐ హరిప్రసాద్‌ రెడ్డి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి దొరికారు. ఈనెల 1న చైతన్యపురి ఏఎ్‌సఐ బాలయ్య రూ.15వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 8వ తేదిన హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయ అవుట్‌పోస్టు ఇన్‌స్పెక్టర్‌ సిద్దేశ్వర్‌, ఎస్‌ఐ కనకయ్య లు రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. అదే రోజు ఎస్‌ఐ కనకయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి రూ.33.97 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:36 AM