Telugu film industry: పైరసీ భూతంపై సమరం
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:58 AM
పైరసీ భూతం నుంచి తెలుగు సినిమాలను రక్షించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(...
తెలుగు సినిమాను రక్షించేందుకు తెలంగాణ పోలీస్, టీఎ్‌ఫసీసీ జట్టు
పైరేటెడ్ మీడియా, ఆన్‌లైన్ కాపీరైట్..నేరాలను దీటుగా అరికట్టేందుకు వ్యూహం
సాంకేతిక వ్యవస్థ ఏర్పాటుకు ఎంవోయూ
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పైరసీ భూతం నుంచి తెలుగు సినిమాలను రక్షించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎ్‌ఫసీసీ) నడుం బిగించాయి. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న సినిమా పైరసీ, ఆన్‌లైన్ కాపీరైట్ ఉల్లంఘనలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక, సమన్వయపూర్వక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సీఎ్‌సబీ, టీఎ్‌ఫసీసీ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న పైరసీ సమస్యను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ ఎంవోయూ కుదుర్చుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో సీఎ్‌సబీ డైరెక్టర్ శిఖాగోయల్, ఎఫ్‌సీసీ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్ బాబు సంతకాలు చేశారు. పైరసీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ గ్రూప్‌లు, ఐపీ టీవీ స్ట్రీమ్‌లు, మొబైల్ యాప్‌లు, క్యామ్‌కార్డింగ్ నెట్‌వర్క్‌తో జరిగే డిజిటల్ పైరసీని సమర్థంగా నియంత్రించడమే లక్ష్యంగా పోలీస్, సినీ పరిశ్రమ కలిసి పనిచేయనున్నాయి. పైరసీ నెట్‌వర్క్‌లకు చెక్ పెట్టేందుకు నిరంతర పర్యవేక్షణ, పైరసీకి సంబంధించిన సమాచార సేకరణ, సత్వర చర్యల కోసం అవసరమైన ప్రత్యేక వ్యవస్థను ఈ ఎంవోయూ ద్వారా ఏర్పాటు చేయనున్నారు.
సమన్వయంతోనే కట్టడి: డీజీపీ
వ్యవస్థీకృత సైబర్ నేరంగా డిజిటల్ పైరసీ మారిపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పైరసీని ఎదుర్కొనేందుకు చట్టాన్ని అమలు చేసే సంస్థలు, సినీ పరిశ్రమ మధ్య నిరంతర సమన్వయం అవసరమన్నారు. పైరసీ కట్టడితో పాటు సృజనాత్మక, ఆర్థిక ప్రయోజనాలను రక్షించేందుకు ఈ ఎంవోయూ కీలక అడుగు అని డీజీపీ వెల్లడించారు. అత్యంత వేగంగా పుట్టుకొస్తున్న సైబర్ నేరాల్లో డిజిటల్ పైరసీ ఒకటని సీఎ్‌సబీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఈ విషయంలో కొన్ని నిమిషాలు ఆలస్యమైనా చిత్ర నిర్మాతలు, హక్కుదారులకు అపార నష్టం కలుగుతుందని అన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పైరసీని ఎదుర్కోవడంలో ముందంజలో ఉంది. తమిళ్ బ్లాస్టర్స్, ఐ బొమ్మ వంటి ప్రధాన పైరసీ వెబ్‌సైట్లపై ఇటీవల తీసుకున్న చర్యలు సినిమా పరిశ్రమకు తెలంగాణ పోలీస్ అందిస్తున్న మద్దతుకు నిదర్శనం. దేశంలోనే 15 ఏళ్లుగా ప్రత్యేక యాంటీ పైరసీ సెల్‌ను కలిగిన ఏకైక పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ. సీఎ్‌సబీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య జరిగిన ఎంవోయూ డిజిటల్ పైరసీపై పోరాటంలో మరో కీలక మైలురాయి’’ అని దగ్గుబాటి సురేశ్ బాబు తెలిపారు. డిజిటల్ పైరసీ అత్యంత సున్నితమైన సమస్య అని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ ఛైర్మన్ రాజ్ కుమార్ ఆకెళ్ల తెలిపారు. కాపీరైట్ ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు గుర్తించడంతోనే నిర్మాతల నష్టాలను నియంత్రిచగలమన్నారు. ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ, నిర్మాతలు సాహు గరపాటి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చెరుకూరి సుధాకర్, జెమినీ కిరణ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, రాజశేఖర్ అన్నాభీమోజు, రాజ్ కుమార్ ఆకెళ్ల తదితర సినీ ప్రముఖులు, పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంవోయూలోని ముఖ్యమైన అంశాలు..
పైరసీ నెట్‌వర్క్‌లు, ఉల్లంఘనలకు పాల్పడుతున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై నిరంతర పర్యవేక్షణ, పైరసీ సంబంధిత సమాచారాన్ని పంచుకోవడంలో పరస్పర సహకారం.
సైబర్ క్రైం అధికారులతో సమన్వయం కోసం సీఎ్‌సబీ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌సీసీ యాంటీ పైరసీ ఏజెంట్ల నియామకం
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు, సోషల్ మీడియా సంస్థలు, యాప్ స్టోర్లతో సమన్వయం చేసుకుని పైరసీ సినిమాలను తొలగించడం లేదా బ్లాక్ చేయడం.
ధ్రువీకరించబడిన ఫిర్యాదులు, డిజిటల్ ఆధారాలపై వేగవంతమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నోడల్ పర్యవేక్షణ సంస్థగా సీఎ్‌సబీ.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా సంస్థలు, యాప్ స్టోర్లతో సమన్వయం చేసుకుని పైరసీ కంటెంట్‌ను తొలగించడం, బ్లాక్ చేయడం.
ఆటోమేటెడ్ క్రాలర్లు, అనలిటిక్స్, కంటెంట్ ఐడెంటిఫికేషన్ వంటిసాంకేతిక పరికరాల వినియోగం.
పైరసీ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంపొందించేందుకు సంయుక్త అవగాహన కార్యక్రమాలు.