యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టు బోర్డు నియామకానికి కసరత్తు
ABN , Publish Date - May 17 , 2026 | 05:28 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిపాలన వ్యవహారాలను, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి స్వయం ప్రతిపత్తి గల ధర్మకర్తల మండలి(ట్రస్ట్ బోర్డు)ని నియమించే దిశగా...
రాజకీయాలకు అతీతంగా నియామకాలకు సీఎం సూచన
యాదాద్రి, మే 16 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిపాలన వ్యవహారాలను, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి స్వయం ప్రతిపత్తి గల ధర్మకర్తల మండలి(ట్రస్ట్ బోర్డు)ని నియమించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉన్నతస్థాయిలో సలహాదారులు, అధికారులతో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఆలయ అభివృద్ధికి సొంత నిధులు, దాతలను సమకూర్చగలిగే ప్ర ముఖులను ట్రస్ట్‌బోర్డు నియామకంలో పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట ఆలయానికి 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చివరిసారిగా ట్రస్ట్‌బోర్డును నియమించగా, 2009లో బోర్డు పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత 17 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయంలో అనువంశిక ధర్మకర్త ఆధ్వర్యంలో పాలనా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. దేవస్థానం ట్రస్టుబోర్డుకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ దేవాదాయ చట్టంలో గతంలోనే సవరణలు చేశారు. అయితే, ఈ బోర్డులో అవకాశం కోసం రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో నియామకాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక వ్యక్తులు, ఆర్థికంగా సంపన్నమైన ప్రముఖులకు బోర్డులో స్థానం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.