Share News

వైద్య ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు?

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:37 AM

వైద్యవిద్యలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును మరోసారి పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ల రిటైర్‌మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచేందుకు....

వైద్య ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు?

  • 65 నుంచి 70 ఏళ్లకు పెంచేందుకు ఫైల్‌ సిద్ధం!

  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్యలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును మరోసారి పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ల రిటైర్‌మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఫైల్‌ ఇప్పటికే వైద్యశాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలోని వైద్యవిద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను అధిగమించాలంటే రిటైర్‌మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచుకోవచ్చని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సూచించింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెంచారు. తెలంగాణలో గతంలో మెడికల్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును రెండుసార్లు పెంచారు. మొదట 58 నుంచి 61 ఏళ్లకు పెంచగా.. 2019 జూన్‌లో రెండోసారి 65 ఏళ్లకు పెంచారు. మరోసారి పెంచేందుకు ఉద్దేశించిన ఫైల్‌ను వైద్య ఆరోగ్యశాఖ సర్క్యులేషన్‌లోకి తీసుకొచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాలుగు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నుంచి హెల్త్‌ ఆ శాఖ మంత్రి దామోదరకు ఈ ఫైల్‌ చేరింది. మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే దానిని సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం కోసం పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కూడా అందుకు ఆమోదం తెలిపితే...తదుపరి దానిని ఆర్థికశాఖకు పంపుతారని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

పీజీ సీట్ల కోతను తప్పించేందుకే..

తెలంగాణలో 35ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. ఇందులో 4,090 ఎంబీబీఎస్‌ (యూజీ), 1,298 పీజీ, 110వరకు సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. వైద్య కళాశాలల్లో 60 శాతం అధ్యాపకుల కొరత ఉంది. దానికితోడు ఈ ఏడాది సుమారు 25-30 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయబోతున్నారు. ఒకవైపు కొరత, మరోవైపు ఉన్నవారు పదవీ విరమణ చేయడం, కాంట్రాక్టులోనూ దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్‌మెంట్‌ వయసును పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు అఽధ్యాపకులు లేకుంటే ఉన్న పీజీ సీట్లకు కోత పడుతుంది. కొత్త వైద్య కళాశాల్లో మరికొన్ని పీజీ సీట్ల కోసం కూడా సర్కారు దరఖాస్తు చేసింది. ఇప్పుడు ఉన్న సీట్లను కాపాడుకొని, కొత్తవి తెచ్చుకోవాలంటే కచ్చితంగా ప్రొఫెసర్లు సరిపడినంత మంది ఉండాలి. అందుకు ఉన్న ఏకైక మార్గం పదవీ విరమణ వయసును పెంచడమే. అయితే, ఈ ప్రతిపాదనను కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. పదవీ విరమణ వయసును పెంచరాదని హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ శనివారం ప్రభుత్వానికి లేఖలు రాశాయి. తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జండ్‌ చోంగ్థు, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్రకుమార్‌ కార్యాలయాల్లో సంప్రదించగా వారు అందుబాటులో లేరు. ఫోన్‌ కాల్‌, మెసేజ్‌ ద్వారా ప్రయత్నించినా స్పందించలేదు.

Updated Date - Jun 21 , 2026 | 05:37 AM