కోటి ఎకరాలునిషేధిత జాబితాలోకి?
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:24 AM
రాష్ట్రంలో నిషేధిత జాబితాలోకి చేరే భూములు భారీగా పెరగనున్నాయి. సుమారు కోటి ఎకరాలను నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైనట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది...
జిల్లాల వారీగా ప్రభుత్వానికి అందిన నివేదికలు
రెండు నెలల క్రితమే అందినా.. పోర్టల్‌లో పెట్టని సర్కారు
రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లోని అత్యంత ఖరీదైన..భూములు ఎక్కువగా నిషేధిత జాబితాలో చేర్పు!
వెల్లడించేందుకు తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వం
ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో నిషేధిత జాబితాలోకి చేరే భూములు భారీగా పెరగనున్నాయి. సుమారు కోటి ఎకరాలను నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైనట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిషేధిత జాబితాలకు సంబంధించి జిల్లాల వారీగా నివేదికలను ప్రభుత్వం రెండు నెలల క్రితమే తెప్పించుకుంది. ఆ జాబితాల ప్రకారం నిషేధిత భూములు కోటి ఎకరాలు దాటే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ నివేదికల ఆధారంగా రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో డిసెంబరు 3 నుంచి అధికారికంగా నిషేఽధిత భూముల వివరాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అయితే అత్యంత ఖరీదైన భూములను అంత పెద్దమొత్తంలో నిషేధిత జాబితాలో చేర్చితే.. ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనని, అసంతృప్తి, ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంటుందేమోనని తర్జనభర్జన పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని అత్యంత విలువైన భూములను ఎక్కువగా నిషేధిత జాబితాలో పెట్టారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆ రంగం మరింత ఎక్కువగా ప్రభావితం అవుతుందనే అభిప్రాయాలున్నాయి. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రోజువారీ లావాదేవీల పైనా తీవ్ర ప్రభావం ఉంటుందని అఽధికారులు కూడా చెబుతున్నారు. అభివృద్ధి వేగంగా జరుగుతున్న కోర్ అర్బన్, పెరీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుందని రియల్టర్లు అంటున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, భూ యజమానుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే.. రెండు నెలల క్రితం నివేదిక అందినా ఇప్పటికీ నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది.
అధికారుల దోపిడీకి అస్త్రం..!
రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 13.82 లక్షల ఎకరాలు, ప్రభుత్వ ఖాళీ భూములు 7.21 లక్షల ఎకరాలు, అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు, దేవాదాయ శాఖ కింద 74, 128 ఎకరాలు, వక్ఫ్ భూములు 45,564 ఎకరాలు ఉన్నాయి. అన్నీ కలిపి సుమారు 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో కనిపించేవి. కానీ, ఇప్పుడు రైతుల సాగులో ఉన్న భూములను కూడా ఏదో ఒక కారణం చూపించి నిషేధిత జాబితాలో పెడుతున్నారనే విమర్శలున్నాయి. 2017 వరకు రాష్ట్రంలో 10 శాతానికి మించని 22ఏ కేసులు.. నేడు 30 నుంచి 40 శాతం వరకు ఎందుకు పెరిగాయనేదానిపై ప్రభుత్వం రైతులను భయపెట్టడానికి, డబ్బు వసూలు చేయడానికి మాత్రమే ఈ జాబితాను రెవెన్యూ అధికారులు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో పెడుతున్న భూములపై నిరభ్యంతర పత్రాల పేరుతో రూ.కోట్ల దందా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి జిల్లాల వారీగా ప్రభుత్వ భూములు కానివి ఎన్ని లక్షల ఎకరాలు 22ఏ జాబితాలోకి ఎక్కాయో, ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.