కల్తీపై గ్రేహౌండ్స్ అస్త్రం!
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:30 AM
తెలంగాణ రాష్ట్రంలో ఆహార, ఔషధాల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు విభాగాలను కలపి తెలంగాణ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని(టీజీ ఎఫ్‌ఏడీసీఏ) ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఆహార, ఔషధ కల్తీ కట్టడికి ఏకీకృత వ్యవస్థ హైడ్రా తరహాలో టీజీ ఫాడ్కా బలగాలు
గ్రేహౌండ్స్ నుంచి 100 మంది సిబ్బంది
టీజీ ఫాడ్కా బాస్‌గా ఐపీఎస్ అవినాశ్ మహంతి
ఫుడ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి ఫాడ్కా తనిఖీలు
తొలుత హైదరాబాద్ 3 కార్పొరేషన్లలో..
దశల వారీగా రాష్ట్రమంతా విస్తరించే లక్ష్యం
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఆహార, ఔషధాల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు విభాగాలను కలపి తెలంగాణ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని(టీజీ ఎఫ్‌ఏడీసీఏ) ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీని విధివిధానాలపై త్వరలో అధికారికంగా ఉత్తర్వ్యులు జారీ చేయనున్నారు. హైడ్రా మాదిరిగా దీనికి కఠిన చర్యలు తీసుకొనే అధికారాలను ఇవ్వనున్నారు. ఫాడ్కాకు బాస్‌గా ఐపీఎస్ అధికారిని నియమిస్తారు. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అవినాశ్ మహంతికేదీని బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఫాడ్కాను తొలుత క్యూర్ ఏరియా పరిధిలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతా విస్తరిస్తారు. సోమవారం ఫాడ్కాపై సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఫాడ్కాకు గ్రేహౌండ్స్ దళాలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార, ఔషధాల కల్తీ ఎక్కువగా ఉందని సర్కారు భావిస్తోంది. కల్తీ నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయమని చెప్పారు. ఇప్పటికే అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఫుడ్ సేఫ్టీ విఽధానాలను అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు. వీటి ఆధారంగా బిల్లు రూపొందించి శాసనసభలో పెడతారు. శాసనసభలో చర్చిండమే కాకుండా ప్రజలనుంచీ అభిప్రాయాలు స్వీకరిస్తారు. కల్తీపై సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లకు అవకాశం ఇస్తారు. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తారు. ఫాడ్కాకు అవసరమైన మానవ వనరులు, బడ్జెట్ కేటాయింపులపై సీఎస్ వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. గ్రేహౌండ్స్ నుంచి 100 మంది సిబ్బందిని ఫాడ్కాకు పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి లేకపోవడంతో దానికోసం పని జేసే గ్రేహౌండ్స్ సిబ్బందిని పలు రకాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ విభాగానికి కొంతమందిని, ఫుడ్ అండ్ డ్రగ్ విభాగానికి మరి కొంత మందిని పంపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
సంయుక్తంగా తనిఖీలు
ఆహార ఉత్పత్తి యూనిట్లు, తయారీదారులు ఫుడ్‌సేఫ్టీ అధికారులను తనిఖీ సమయాల్లో లెక్క చేయడం లేదు. సహకరించడం లేదు. ఒకరిద్దరు అధికారులు తనిఖీలకు వెళ్లినా గప్‌చు్‌పగా నమూనాలు సేకరించుకొని బయట పడుతున్నారు. ఆహార ఉత్పత్తిదారులు, తయారీదారులు, హోటళ్ల యాజమాన్యాలు వీళ్లను సీరియ్‌సగా తీసుకోవడం లేదు. కల్తీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తారన్న భయం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో తనిఖీలకు వెళ్తే సీరియె్‌సనెస్ పెరుగుతుందన్న భావన సర్కారులో ఉంది. ఔషధ కల్తీ నియంత్రణ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతేఉంది. ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా నకిలీ ఔషధాలు దిగుమతి అవుతున్నాయు. డ్రగ్ కంట్రోల్ విభాగం తనిఖీలు చేస్తున్నప్పటికీ వాటి ప్రవాహం తగ్గడం లేదు. అందుకే ఈ రెండు విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఖాకీ కోరలు తొడగాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.