Minister Uttam Kumar Reddy: చేతికొచ్చిన పంట నష్ట నివారణకు చర్యలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:56 AM
చేతికొచ్చిన పంటలను ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తద్వారా...
సైలో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే యోచన: ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): చేతికొచ్చిన పంటలను ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తద్వారా రైతుకు భరోసా కల్పించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడం సులభ తరమవుతుందని అన్నారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. గురువారం సచివాలయంలో ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతికందిన ధాన్యం నష్టపోకుండా ఉండేందుకు గాను ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైలో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. సైలో పద్దతిలో బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ లాంటి పంటలను కుడా నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు. మనుషుల జోక్యం లేకుండానే సైలో పద్ధతిలో ఉండే ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు, డ్రైయర్లతో రెండు సంవత్సరాల వరకు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. సైలో పద్ధతిలో ఉండే డ్రైయర్ల ద్వారా తేమను తొలగించడంతో పాటు ధాన్యాన్ని దీర్ఘకాలికంగా పరిరక్షంచుకోవచ్చని ఆయన వెల్లడించారు.