10వేల ప్రాథమిక స్కూళ్లకు ఇక ‘సెలవే’?
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:19 AM
రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని 10వేల ప్రాథమిక పాఠశాలలు.. సమీప బడుల్లో విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రాథమిక పాఠశాలలు ఉంటే..
రెండేళ్లలో సమీప బడుల్లో విలీనం
ఇవి1-19విద్యార్థులున్న ఏకోపాధ్యాయ స్కూళ్లే
విద్యార్థుల సంఖ్య 10 కన్నా తగ్గితే మూసివేతే
హైదరాబాద్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని 10వేల ప్రాథమిక పాఠశాలలు.. సమీప బడుల్లో విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రాథమిక పాఠశాలలు ఉంటే.. ఇందులో 1-19 వరకు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ స్కూళ్లు 10వేల వరకు ఉన్నాయి. ఈ బడుల్లో విద్యార్థుల సంఖ్య 10కంటే తగ్గితే.. ఇప్పుడున్న సింగిల్ టీచర్ కూడా అవసరం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్న లక్ష్యంతో గతంలో ఏర్పాటు చేశారు. అయితే, పాఠశాలల హేతుబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2021లో జీవో25 విడుదల చేసింది. దీని ప్రకారం 0-19 వరకు విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 20-60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 61-90 మంది ఉంటే ముగ్గురు, 91-120 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య 10మంది కన్నా తగ్గితే.. ఆ బడులను మూసివేస్తూ వస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలోనూ 1400 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. వాటిలోని సిబ్బందిని సమీప బడులకు బదిలీ చేశారు. ప్రస్తుతం 10వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 19లోపే ఉంది. ఈ లెక్కన వచ్చే రెండేళ్లలో ఈ 10వేల బడులు మాయమయ్యే ప్రమాదం ఉంది.
విద్యా శాఖ తీరుపై టీచర్ల ధ్వజం
2026-27 విద్యా సంవత్సరం జూన్ 15న ప్రారంభమైంది. అదే రోజు బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, జూన్19లోపు ఉన్న ప్రవేశాలనే ప్రామాణికంగా తీసుకుంటామని ఇటీవల విద్యాశాఖ ప్రకటించింది. అప్పటిలోపు ఆన్‌లైన్ యుడై్‌సలో విద్యార్థి వివరాలు నమోదు చేస్తేనే ఆ పాఠశాల విద్యార్థిగా పరిగణిస్తారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఏటా సెప్టెంబరు ఆఖరు వరకు ప్రవేశాలు పూర్తి చేసి, ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకునే వారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా జూన్ 19నాటి వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రకటించడం వెనుక.. పాఠశాలలను మూసివేసే కుట్ర కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. మరోవైపు.. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులూ విముఖత చూపుతున్నారు. విద్యార్థుల సంఖ్య లేదని ప్రభుత్వం బడులను తొలగిస్తుండగా, టీచర్లు లేనప్పుడు పిల్లలను ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.