మార్చిలో పరిషత్ వార్!
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:09 AM
రాష్ట్రం లో పరిషత్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే..
మొదటి వారంలో రెండు విడతల్లో జరిగే చాన్స్.. రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేసి ఎన్నికలకు
మునిసిపల్ ఎన్నికల్లో 80ు స్థానాలు తమవేనన్న అంచనాలో అధికార కాంగ్రెస్
కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ.450 కోట్ల నిధులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో పరిషత్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే.. అదే ఊపులో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. అందుకే పరిషత్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నీ కుదిరితే.. బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం మునిసిపల్ ఎన్నికలు ముగిశాక ఈ నిధులను రైతుల ఖాతాల్లో వేసి.. ఆ తరువాత పరిషత్ ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెబుతున్నాయి. మార్చి తొలివారంలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల ఫలితాలే వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రతిపక్షం బీఆర్‌ఎ్‌సకు చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి.
ప్రతిపక్షాలు తేరుకోక ముందే..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాకపోగా.. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిటింగ్ సీట్లను కూడా కోల్పోయింది. పంచాయతీ ఎన్నికల్లో 60 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. బీఆర్‌ఎస్ 26శాతానికే పరిమితమైంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్లోనూ 80శాతానికి పైగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని కాం గ్రెస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు దక్కించుకున్న బీజేపీ.. ఆ ఎన్నికలతోపాటు జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో మునిసిపోల్‌లోనూ కాంగ్రెస్ హవానే ఉంటుందన్న అంచనాలో ఉన్న సీఎం.. ఇదే వేడిలో పరిషత్ ఎన్నికలూ నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఇంకా తేరుకోని ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈ ఎన్నికలూ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలతో ఖజానాకూ ఉపశమనం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ఖజానాకు కూడా ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.450 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా నిలిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంతో 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియనుండడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఈ మొత్తం మురిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించి.. వివరాలు పంపిస్తే పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కేంద్రానికి వివరాలు సమర్పించి.. నిధులు విడుదలయ్యేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు పరిషత్ ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వాటి ని క్యాబినెట్ ఆమోదించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. ఇంకో వైపు మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బిజీగా ఉంటారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ బోర్డు పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటే మొ దటి రెండు వారాల్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతా అనుకున్నట్లుగా జరిగితే మార్చి మెదటి వారంలోనే రెండు విడుతలుగా పరిషత్ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆరు నెలల తర్వాతే..
జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలు ఆరు నెలల తర్వాతే నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త కార్పొరేషన్లు కుదురుకోవాల్సి ఉండటం, మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉండటం, ఆ తర్వాత ఎండలు తదితర కారణాలతో ఆరు నెలల తర్వాతే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.