తక్కువ రుసుంతో మళ్లీ భూమి శిస్తు
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:45 AM
గతంలో రైతుల భూములకు సంబంధించి భూమి శిస్తు చెల్లించే విధానం ఉండేదని తద్వారా ఎవరి భూమి ఎవరి ఆధీనం లో ఉన్న విషయం కూడా తెలిసేదని..
రాష్ట్ర ప్రభుత్వం యోచన .. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదర్బార్.. నియోజకవర్గాల్లో నిర్వహణకు పరిశీలన
దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయిస్తాం
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి
ఖమ్మం, అశ్వారావుపేట/దమ్మపేట, జూన్ 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గతంలో రైతుల భూములకు సంబంధించి భూమి శిస్తు చెల్లించే విధానం ఉండేదని తద్వారా ఎవరి భూమి ఎవరి ఆధీనం లో ఉన్న విషయం కూడా తెలిసేదని.. ప్రభుత్వం ఇప్పుడు అదే పద్ధతిని ప్రవేశపెట్టి, తక్కువ భూమి శిస్తును వసూలు చేసే ఆలోచన చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తద్వారా భూ ఆక్రమణలు జరిగే ఆస్కా రం ఉండదని, అసలు యజమానులకే హక్కులు లభిస్తాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి ఆధునిక భూ సర్వేను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని కాకరవాయి గ్రామంలో సర్వే పూర్తిగా విజయవంతమైందని, అసలు యజమానులకు పట్టా పుస్తకాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో లైసెన్స్‌డ్ సర్వే, ప్రైవేటు సర్వేయర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, వారికి సర్వే చేసినందు కు ఎకరాకు రూ.50 రుసుంను పెంచనున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజాదర్బార్ విజయవంతమైనందున దీన్ని స్ఫూర్తిగా తీసుకు ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ సభలు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు రూపొందించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా 14 క్లస్టర్లలో నెలరోజుల్లో ప్రజాదర్బార్ సభలు నిర్వహించామని, ఈ సభల ద్వారా 45 వేల మందిని ప్రత్యక్షంగా కలుసుకున్నామన్నారు. ఇందు లో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11వేలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 ఆర్జీలు వచ్చాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1970కి పూర్వం నుంచి గిరిజనేతరులకు భూములున్నా వారికి పట్టాలు లేకుండా సాగులో ఉంటున్నారని, వీరి భూములకు భరోసా కల్పించేందుకు ఓ కమిటీని నియమించి ఆరు నెలల్లోపు సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు ఓ వైబ్రేషన్
ఇందిరమ్మ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వైబ్రేషన్‌తో అమలు చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. మంగళవారం దమ్మపేట మండలంలోని కట్కూరు, పూసుకుంట తదితర గ్రామాల్లో, పలు కొండరెడ్ల గ్రామాల్లో 280 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు చూపించిన ఆప్యాయత, ఇల్లు వచ్చిందన్న వారి సంతోషంతో చలించిపోయానని తెలిపారు. హైదరాబాద్ తర్వాత అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రెండోవిడతలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
రెండోవిడతగా 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నామని, అలాగే రూ.200 కోట్లు చొప్పున వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 99 యంగ్ ఇండి యా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగంగా నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.