Share News

అక్టోబరు 31 కల్లా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు పూర్తి

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:18 AM

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీల్లో...

అక్టోబరు 31 కల్లా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు పూర్తి

  • రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌/మహదేవపూర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీల్లో అన్నిరకాల పరీక్షలు చేసే బాధ్యతను కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పూణే)కు ఇదివరకే అప్పగించిన ప్రభుత్వం... బ్యారేజీల పునరుద్ధరణ పనుల బాధ్యతను ఆర్మీకి చెందిన కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు అక్టోబరు 31వ తేదీ కల్లా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే 2027 జనవరి నుంచి మరమ్మతులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఒక్కో బ్యారేజీకి ఒక్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నేతృత్వంలో 10మంది జేఈలు/డీఈఈలతో మొత్తం మూడు బృందాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ నాణ్యతా పరీక్షలు వేగం పుంజుకున్నాయి. బ్యారేజీ అప్‌ స్ర్టీమ్‌, డౌన్‌ స్రీమ్‌లో కలిపి 500 బోర్‌హోల్స్‌ వేయాల్సి ఉండగా.. ఆరు మాత్రమే పూర్తికావడంపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లోనే బోర్‌హోల్స్‌ పూర్తి చేసి శాంపిల్స్‌ సేకరించాలన్న ఆదేశాల మేరకు పనులు ముమ్మరమయ్యాయి. బోర్‌హోల్స్‌ వేసే ఏజెన్సీ ప్రతినిధులు మేడిగడ్డ బ్యారేజీని శనివారం పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 04:18 AM