ఇంటర్ బోర్డు రద్దు?
ABN , Publish Date - May 07 , 2026 | 05:40 AM
రాష్ట్ర విద్యాశాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు 11, 12వ తరగతులకు స్వతంత్రంగా కొనసాగుతున్న ఇంటర్ బోర్డును రద్దు చేసి, దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించింది.
పాఠశాల విద్యలో విలీనం
ముఖ్యమంత్రి నిర్ణయం.. విధివిధానాలపై కసరత్తు!
ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్ జేఏసీ ఆగ్రహం
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు 11, 12వ తరగతులకు స్వతంత్రంగా కొనసాగుతున్న ఇంటర్ బోర్డును రద్దు చేసి, దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ కీలక మార్పుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ దిశగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, దీనికి సంబంధించి ఇంటర్ బోర్డుకు కూడా సమాచారం లేదు. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలోనే ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు అకస్మాత్తుగా వాయిదా వేసినట్లు తెలిసింది.
7 రాష్ట్రాల్లోనే ఇంటర్ బోర్డులు..
1969-70 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న.. మాజీ ప్రధాని పివి.నరసింహారావు నేతృత్వంలోని కోఠారీ కమిషన్ సూచనల మేరకు ఇంటర్‌బోర్డు ఏర్పాటైంది. అప్పట్లో ఉన్న పీయూసీ, హెచ్‌యూసీ, ఎస్‌ఎ్‌సఎల్‌సీ వంటి విధానాలను రద్దు చేసి ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డును ప్రారంభించారు. అప్పటినుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యగా, 11వ తరగతి నుంచి ఉన్నత విద్యగా పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, కేరళ, మణిపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి 7 రాష్ట్రాల్లోనే ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డులున్నాయని, 10వ తరగతి, ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డులు ప్రపంచంలో ఎక్కడా లేవని విద్యా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 12వ తరగతి వరకు పాఠశాల విద్యలో భాగంగా ఉంటే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
డ్రాపవుట్లు తగ్గించడమే లక్ష్యం..
విలీన ప్రక్రియ వెనుక ప్రధానంగా విద్యార్థుల డ్రాపవుట్లు తగ్గించాలనే బలమైన కారణం ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రవ్యాప్తంగా 26వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే .. కేవలం 436 మాత్రమే ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయని.. పాఠశాలలు, కళాశాలల సంఖ్యకు మధ్య భారీ అంతరం ఉందని గుర్తించింది. పాఠశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులు పైచదువుల కోసం తమ ప్రాంతం నుంచి సుదూరంగా ఉన్న కళాశాలలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొంది. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవడంతోనే పది తర్వాత బాలికలకు వివాహాలు చేసే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంది. 12తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించడం వల్ల డ్రాపవుట్ల సంఖ్య తగ్గుతుందని.. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లాంటి సౌకర్యాలు విద్యార్థులు సమర్థంగా ఉపయోగించవచ్చని కమిషన్ తెలిపింది.ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఇప్పటికే 12వ తరగతి వరకూ బోధన కొనసాగుతోంది. ప్రస్తుతం తన ఆధీనంలోని 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహణతో పాటు విద్యార్థులకు ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకు మాత్రమే ఇంటర్‌బోర్డు బాధ్యతలు పరిమితమయ్యాయి. పదో తరగతి పరీక్షలను ఎస్‌ఎ్‌ససీ బోర్డు నిర్వహిస్తుండగా, ఇంటర్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహిస్తోంది. దీంతో ఏడాదికోసారి నిర్వహించే వార్షిక పరీక్షల కోసమే ప్రత్యేకంగా రెండు బోర్డులు ఎందుకు అని ప్రభుత్వంలో చర్చ ప్రారంభమైంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. సాధ్యమైనంత త్వరగా విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

విద్యార్థుల ప్రయోజనం కోసమే
‘‘ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఆషామాషీగా చేసింది కాదు. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశాం. ప్రపంచంలోని అన్ని దేశాలు 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తున్నాయి. 12వరకు ఒకేచోట చదివితే విద్యార్థుల గురించి ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంటుంది. ఉపాధ్యాయుడు-విద్యార్థి మద్య బంధం పెరుగుతుంది. ఇవన్నీ విద్యార్థి జీవితానికి ఉపయోగపడే అంశాలే.’’
- ఆకునూరి మురళి, ఛైర్మన్, తెలంగాణ విద్యా కమిషన్

ఇంటర్ విద్యామండలిని బొంద పెట్టడమే
ఇంటర్ విద్య రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ దౌర్భాగ్యం. ఎవరు ఎవరినీ తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంటర్ విద్యను బొందపెట్టే చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్ బోర్డు కారణంగానే నేడు పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా సీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. రేవంత్ రెడ్డి మిమ్మల్ని వదలపెట్టం. మీ మెడలు వంచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తాం. ఆకునూరి మురళి సలహాలు విని ఏపీలో విద్యాశాఖ సంస్కరణలు అమలుచేసినందునే జగన్‌కు 11 సీట్లు వచ్చాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రె్‌సకు కూడా ఇదే గతి పడుతుంది.
- మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్