Share News

సీఎస్ఆర్‌ నిధుల వినియోగానికి ప్రత్యేక పాలసీ

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:44 AM

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) నిధుల సమీకరణతోపాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సీఎస్ఆర్‌ నిధుల వినియోగానికి ప్రత్యేక పాలసీ

  • ప్రత్యేక సెల్‌, పోర్టల్‌, ఆఫీసు ఉండాలి

  • కంపెనీలు ఇక్కడ.. ఖర్చు మరోచోట అయితే ఎలా!?

  • రాష్ట్రంలోనే ఖర్చు పెట్టేలా చూడండి: సీఎం

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) నిధుల సమీకరణతోపాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్‌ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే సంస్థలను ప్రభుత్వం తరపున అభినందించాలని సూచించారు. సీఎస్ఆర్‌ నిధులపై గురువారం శాసన మండలి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సీఎం సమీక్షించారు. ఏటా అత్యుత్తమ భాగస్వామ్యం పంచుకున్న సంస్థల ప్రతినిధులను అభినందించడానికి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో సీఎస్ఆర్‌ సెల్‌ను, ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.సీఎస్ఆర్‌ నిధులతో కార్పొరేట్‌ కంపెనీలు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల వివరాలను సమన్వయం చేసే బాధ్యతను ఈ సెల్‌ నిర్వర్తిస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి, కార్పొరేట్‌ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్‌ విరాళాల వాటా మన రాష్ట్రంలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. దాంతో, ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్‌ నిధులు ఆశించిన స్థాయిలో లేవని, కంపెనీలు, పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేసి, సీఎస్ఆర్‌ నిధులను మాత్రం వేరే చోట ఖర్చు పెడితే ఎలా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్‌ ఫండ్స్‌ వచ్చేలా చూడాలని నిర్దేశించారు. ఇతర రాష్ట్రాల్లో వీటి సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ వాటాను పెంచుకునేందుకు వీలుగా కొత్త పాలసీ ఉండాలని, కార్పొరేట్‌ సంస్థలను ఆకర్షించే విధానాలను అనుసరించాలని చెప్పారు.

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు తగ్గుతున్నారేం: సీఎం

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ సర్వీసులు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. ఎంఎంటీఎస్లో ఏటికేడు ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంపై ఆయన ఆరా తీశారు. ఎంఎంటీఎస్‌ సర్వీసులపై శాసన మండలి హాల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ‘‘కార్యాలయాల సమయంలో ఎంఎంటీఎస్‌ సర్వీసుల సంఖ్య పెంచాలి. సమయ పాలనతో నడపాలి. స్టేషన్ల దగ్గరకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేదు. కనక అక్కడికి రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడపాలి’’ అని సూచించారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని నిర్దేశించారు. చిట్టచివరి వరకూ కనెక్టివిటీతోపాటు ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతుల మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Updated Date - Mar 27 , 2026 | 03:44 AM