Share News

ప్రాజెక్టుల భూముల్లో క్యాప్టివ్‌ సోలార్‌ ప్లాంట్లు

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:49 AM

రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల చెందిన భూములు, జలాశయాలు, కెనాళ్ల వద్ద క్యాప్టివ్‌ (సొంత అవసరాలు తీర్చే) సౌర విద్యుత్‌ ప్లాంట్లు పెట్టడానికి వీలుగా కార్యాచరణ...

ప్రాజెక్టుల భూముల్లో క్యాప్టివ్‌ సోలార్‌ ప్లాంట్లు

  • జలాశయాలు, కెనాళ్ల వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల చెందిన భూములు, జలాశయాలు, కెనాళ్ల వద్ద క్యాప్టివ్‌ (సొంత అవసరాలు తీర్చే) సౌర విద్యుత్‌ ప్లాంట్లు పెట్టడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నీ ఎత్తిపోతల ప్రాజెక్టులే ఉండటంతో వాటి నిర్వహణకుగాను సొంతంగా క్యాప్టివ్‌ సోలార్‌ ప్లాంట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జలాశయాల్లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు, భూముల్లో గ్రౌండ్‌ మౌంటెడ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ అవసరాలన్నీ సొంత ప్లాంట్లతో తీరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి వీలుగా నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని సుమారు 16 జలాశయాల వద్ద సోలార్‌ ప్లాంట్లు పెట్టడానికి గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధికారులు మంత్రికి వివరించారు.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని అదిగమించటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేవలం 52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్నే ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:49 AM