Share News

రేవంత్‌ అనుచరులమనే మా ఫోన్లు ట్యాపింగ్‌ చేయించారు

ABN , Publish Date - May 21 , 2026 | 03:48 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు బుధవారం నమోదు చేశారు.

రేవంత్‌ అనుచరులమనే మా ఫోన్లు ట్యాపింగ్‌ చేయించారు

  • సిట్‌ విచారణలో గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌

  • గంటన్నర విచారణ.. వాంగ్మూలం నమోదు

  • సిట్‌ విచారణకు బీజేపీ నాయకుడు బోసుపల్లి ప్రతాప్‌

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు బుధవారం నమోదు చేశారు. ఆయన్ని బాధితుడిగానే నోటీసు ఇచ్చి పిలిచామని సిట్‌ అధికారులు తెలిపారు. మధుసూదన్‌ రెడ్డి దాదాపు గంటన్నర సిట్‌ కార్యాలయంలో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయ్యిందని సిట్‌ అధికారులు వివరించి, అందుకు తగిన ఆధారాలు చూపించారని విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మధుసూదన్‌ రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి ప్రధాన అనుచరులు, కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ప్రభాకర్‌ రావు ఆధ్వర్యంలోని టీమ్‌ ట్యాపింగ్‌ చేసిందని, అందులో తన ఫోన్‌ నెంబర్‌ ఒకటని ఆయన వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనుచరులు అందరి ఫోన్లను ఆయనే(కేసీఆర్‌) ట్యాపింగ్‌ చేయించారని, సిట్‌ విచారణలో ఒకరి తర్వాత ఒకరం వాంగ్మూలాలు ఇస్తున్నామని మధుసూదన్‌ రెడ్డి చెప్పారు. రేవంత్‌ అనుచరుడిననే ఏకైక కారణంతోనే తన ఫోన్లు ట్యాపింగ్‌ చేయించారని ఆయన ఆరోపించారు. కాగా 2023 ఎన్నికల సమయంలో మీ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని విచారణకు రావాలని సిట్‌ అధికారులు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతా్‌పను కోరడంతో ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తుది చార్జిషీటును త్వరలో దాఖలు చేస్తామని హైదరాబాద్‌ సీపీ సజ్జన్నార్‌ ప్రకటించిన నేపథ్యంలో చార్జిషీటుకు అవసరమైన పేపర్‌ వర్క్‌లో సిట్‌ అధికారులు బిజీగా ఉన్నారు. సిట్‌ బృందంలో అదనంగా కొంతమంది రైటర్లు, న్యాయ నిపుణులను చేర్చారు. పేపర్‌ వర్క్‌ పూర్తయిన తర్వాత నిందితులపై నేరారోపణలు, అందుకు తగిన సాక్ష్యాధారాలను ఒకదాని తర్వాత మరొకటి క్రోడీకరించడం, నేరం జరిగిన తీరు, అవసరమైన డాక్యుమెంటేషన్‌ వర్క్‌ జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - May 21 , 2026 | 03:48 AM