మావోయిస్టుల పేరిట కుట్ర!
ABN , Publish Date - May 27 , 2026 | 05:09 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ క్రమంలో సిట్ అధికారుల విచారణ తీరు ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల పేరుతో రాష్ట్రంలోని ప్రముఖలందరి ....
ట్యాపింగ్ కేసులో మారిన దర్యాప్తు దిశ
సంబంధం లేని వారి నంబర్లూ మావోయిస్టు ఖాతాలో
ఆ కుట్రను నిర్ధారించే దిశగా సాగుతున్న సిట్ దర్యాప్తు
సీఎం సోదరులు, సన్నిహితుల వాంగ్మూలాల నమోదు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ క్రమంలో సిట్ అధికారుల విచారణ తీరు ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల పేరుతో రాష్ట్రంలోని ప్రముఖలందరి ఫోన్లనూ ట్యాప్ చేసిన కుట్రను నిరూపించే దిశగా దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలంలోని ప్రతి పదానికీఅర్థం వెతకడంతో పాటు ఆయన నేరాన్ని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాల సేకరణ పైనా సిట్ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ నిమిత్తం రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఇచ్చిన లేఖలో.. మావోయిస్టు కార్యక్రమాలపై నిఘాలో భాగంగా అనుమతి కోరుతున్నట్లు పేర్కొన్నారు. లేఖతోపాటు ఇచ్చిన జాబితాలో ఉన్న నంబర్లన్నీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వారు, లేదా, వారికి సహకరిస్తున్న వారు అని అర్థం వచ్చేలాగా ఆయన అనుమతి కోరారు. ఆ నంబర్లను వాడేవారందరి వాంగ్మూలాలను సేకరించడం ద్వారా.. మావోయిస్టు పార్టీతో వారికి ఎలాంటి సంబంధాలూ లేవన్న విషయాన్ని నిరూపించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. ట్యాపింగ్ లిస్టులో ఉన్న ఒకో వ్యక్తినీ పిలిపించి, వారి జీవిత నేపధ్యంతో పాటు వారికి మావోయిస్టు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవన్న విషయాన్ని నమోదు చేయించడాన్ని సిట్ అధికారులు ప్రారంభించారు. మావోయిస్టు ఆపరేషన్లలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశామన్న ప్రభాకర్‌రావు వాదన తప్పు అని.. రాజకీయ కుట్రతోనే ట్యాపింగ్ జరిగిందని.. సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడానికి సిట్ అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, వారి ప్రధాన అనుచరుడు శ్రీరాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మఽధుసూదన్ రెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేశారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు, ప్రధాన అనుచరులు కావడంతో వీరెవ్వరికి మావోయిస్టులతో సంబంధాలు లేవన్న విషయాన్ని నిరూపించడం, రాజకీయ కోణాన్ని బహిర్గతం చేయడమే లక్ష్యంగా సిట్ విచారణ సాగుతోంది. ఈమేరకు.. గతంలో సిట్ అధికారులు చేసిన దర్యాప్తునకు.. నూతన అధికారులతో సిట్‌ను బలోపేతం చేసిన తర్వాత జరుగుతున్న దర్యాప్తునకు మధ్య మార్పు స్పష్టంగా కన్పిస్తోందని పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.