Share News

ట్యాపింగ్‌పై జూన్‌లోనే చార్జిషీట్‌ దాఖలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:06 AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఈ జూన్‌ నెలలోనే చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు సిట్‌ అధికారులు వెల్లడించారని ప్రభుత్వ విప్‌ యెన్నం...

ట్యాపింగ్‌పై జూన్‌లోనే చార్జిషీట్‌ దాఖలు

  • కేసులో బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి: యెన్నం

  • ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి సిట్‌ ఎదుట హాజరు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఈ జూన్‌ నెలలోనే చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు సిట్‌ అధికారులు వెల్లడించారని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయన సిట్‌ అధికారుల ముందు హాజరై తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. అనంతరం సీఎల్పీ మీడియాహాల్లో యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ, ఈ ట్యాపింగ్‌ వ్యవహారంలో భాగస్వాములైన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా చట్టం ముందు జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు, ఎమ్మెల్యే నుంచి మాజీ సీఎం వరకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో నా ఫోన్‌తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లూ ట్యాప్‌ చేశారు. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 19ల ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమే’అని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించి ఎన్నికల్లో గెలవలేక, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, వారిని బెదిరించడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి అప్పటి అధికార పార్టీ ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లలో వేలాది మంది ఫోన్లను ట్యాప్‌ చేశారని, కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురి రాజకీయ భవిష్యత్తు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేశారని విమర్శించారు.

Updated Date - Jun 02 , 2026 | 05:06 AM