ఇంధన సరఫరాను పెంచాలి
ABN , Publish Date - May 17 , 2026 | 06:07 AM
రాష్ట్రంలో ఇంధన సరఫరాలో అంతరాయం ఉందని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. మూడు వారాలుగా అనేక జిల్లాల్లోని డీలర్లు ఇచ్చిన ఇండెంట్ల మేర...
డీలర్లు ఇచ్చిన ఇండెంట్ల మేర ఆయిల్ సరఫరా లేదు
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఇంధన సరఫరాలో అంతరాయం ఉందని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. మూడు వారాలుగా అనేక జిల్లాల్లోని డీలర్లు ఇచ్చిన ఇండెంట్ల మేర పెట్రోల్, డీజిల్ సరఫరా కావడం లేదని ప్రస్తుతం ఇంధన సరఫరా అస్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ఇంధన సరఫరా, అంతరాయాలు, ధరల పెరుగుదల అంశంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.అమరేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం.. డీలర్లు ఇస్తున్న ఇండెంట్ల మేరకు ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మూలధన అవసరాల పెరుగుదలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని, బ్యారెల్ ధర 100-110 డాలర్ల స్థాయిని దాటిందని తెలిపారు. అయినా కొన్ని నెలలపాటు భారత్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించాయని పేర్కొన్నారు. అధిక కొనుగోలు, దేశీయంగా విక్రయ ధరల్లో తీవ్ర వ్యత్యాసం కారణంగా ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు వాటిల్లాయని, ఆ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయన్నారు. లీటరుకు రూ.3 చొప్పున పెంచినా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న మొత్తం నష్టాలను పూర్తిగా భర్తీ చేయడం లేదని, ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే ఇంధన ధరలను కనిష్ఠంగానే ఉంచినట్టు తెలిపారు. ధరల సవరణ అవసరమే అయినా.. క్షేత్రస్థాయిలో డీలర్లకు కూడా వర్కింగ్ క్యాపిటల్, ఆయిల్ సరఫరా అంతరాయం సమస్యలు ఉన్నాయన్నారు.