మరణించిన వారికీ పింఛన్లు!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:31 AM
రాష్ట్రంలోని వివిధ వర్గాల వారికి ప్రభుత్వం అందజేస్తున్న చేయూత పింఛన్లు.. బ్రతికి ఉన్నవారికే కాకుండా మరణించిన వారికీ అందుతున్నాయి.
41 వేల మంది చనిపోయినవారి ఖాతాల్లో డబ్బు జమ
ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న 3,475 మందికి ఇక్కడ పింఛన్లు
ఎక్కడ ఉన్నారో తెలియని 11,184 మంది లబ్ధిదారులు
లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియలో వెల్లడైన వాస్తవాలు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ వర్గాల వారికి ప్రభుత్వం అందజేస్తున్న చేయూత పింఛన్లు.. బ్రతికి ఉన్నవారికే కాకుండా మరణించిన వారికీ అందుతున్నాయి. ఔను.. రాష్ట్రవ్యాప్తంగా 41వేల మందికిపైగా పింఛన్ లబ్ధిదారులు మరణించాక కూడా వారి ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియలో ఈ విషయం వెల్లడైంది. లైవ్ అథెంటికేషన్ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఇప్పటికే మరణించిన 41వేల మందికి పైగా లబ్ధిదారుల పేర్లపై పింఛన్లు కొనసాగుతున్నట్లు గుర్తించారు. వారి కుటుంబసభ్యులు కూడా వారి మరణాన్ని ధ్రువీకరించారు. అయితే.. పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తుండటం, చనిపోయినవారి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొందని ప్రభుత్వ విభాగాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 41.20 లక్షల మంది చేయూత లబ్ధిదారులు ఉండగా.. అందులో 22.16 లక్షల మంది పోస్టాఫీసుల ద్వారా పింఛను పొందుతున్నారు. మిగిలిన 19,04239మంది బ్యాంకు ఖాతాల ద్వారా పొందుతున్నారు. వీరిలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది? వారు ఎక్కడ ఉన్నారు? బతికే ఉన్నారా? లేదా?అని తెలుసుకునేందుకు ప్రభుత్వ విభాగాలు లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియను చేపడుతున్నాయి. ఇందుకు సంబంధించి నివేదికను సెర్ప్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందుతున్న 19,04239 మంది లబ్ధిదారుల్లో 15,97,233 (83.88 శాతం) మందికి లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తయింది. మరో 3,07,006 మందివి పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని సెర్ప్ విభాగాలు తెలిపాయి. ప్రస్తుతం ఇతర రాష్ర్టాల్లో నివసిస్తున్నప్పటికీ 3,475 మంది తెలంగాణలో పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి విషయాన్ని ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో.. 11,184 మంది లబ్ధిదారులు ఎక్కడ ఉంటున్నారన్నది సెర్ప్ విభాగాలు గుర్తించలేకపోయాయి. ఇదిలా ఉండగా.. లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియ కోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు 100 మందికి పైగా లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు పింఛను అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. తమకు ఉపాధి, ఆదాయ వనరులు సమకూరాయని, అర్హులకు ఎవరికైనా ఉపయోగపడేలా తమ పింఛన్లు రద్దుచేయాలని వారు కోరినట్లు సెర్ప్ విభాగాలు తెలిపాయి.