Share News

గిగ్‌ వర్కర్లకు సంక్షేమ బోర్డు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:14 AM

రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్ల హక్కులు, భద్రత కోసం తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయనున్నారు.

గిగ్‌ వర్కర్లకు సంక్షేమ బోర్డు

  • యూనిక్‌ ఐడీ, పెన్షన్‌, బీమా, ఇతర సదుపాయాలు

  • ‘గిగ్‌ వర్కర్ల’ బిల్లును ఆమోదించిన శాసనసభ

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్ల హక్కులు, భద్రత కోసం తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గిగ్‌ వర్కర్‌కు ఒక యూనిక్‌ ఐడీని ఇస్తారు. పెన్షన్‌, బీమా, ప్రసూతి ప్రయోజనాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలతో రూపొందించిన బిల్లును మంత్రి వివేక్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఇకపై ప్లాట్‌ ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా బోర్డు పనిచేస్తుంది. కార్మిక శాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన నలుగురు ప్లాట్‌ ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్లు, అగ్రిగేటర్‌/ప్లాట్‌ఫాంల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన నలుగురు ప్రతినిధులు, గిగ్‌, ప్లాట్‌ ఫాం ఆర్థిక రంగంలో పనిచేసిన అనుభవం, విషయ పరిజ్ఞానం కలిగిన నిపుణులైన పౌర సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులు ప్రభుత్వం నామినేట్‌ చేసిన వారు సభ్యులుగా ఉంటారు. బోర్డు పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. ఈ బోర్డు రాష్ట్రంలోని ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్లు ఒకటి లేక అంతకుమించి అగ్రిగేటర్లు/ప్లాట్‌ఫాంలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ వివరాలతోపాటు ఒక డేటా బేస్‌ను నిర్వహించాలి. ప్రతి ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూనిక్‌ ఐడీ ఇవ్వాలి. అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ప్లాట్‌ ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల కోసం సామాజిక భద్రత, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, ఆయా సంస్థలు అందించే సామాజిక భద్రత నిధులు, వ్యక్తిగత ప్లాట్‌ఫాం, గిగ్‌ వర్కర్ల నుంచి సేకరించే విరాళాలతో ఈ నిధి ఏర్పాటవుతుంది. ఎవరైనా అగ్రిగేటర్‌ నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించకపోతే వారికి నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారు. మొదటి ఉల్లంఘనకు రూ. 50 వేలు, రెండో ఉల్లంఘనకు రూ.లక్ష, మూడో ఉల్లంఘనకు రూ.1.50 లక్షలు, నాలుగోసారి లేదా ప్రతి తరువాతి ఉల్లంఘనకు చెల్లించాల్సిన ఫీజు మొత్తానికి ఐదింతలు జరిమానా విధిస్తారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. గిగ్‌ వర్కర్ల సమస్యలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామని, అప్పీలేట్‌ అథారిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated Date - Mar 31 , 2026 | 05:14 AM