Share News

పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు?

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:31 AM

స్థానిక సంస్థల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సోమవారం స్పష్టత రానుంది.

పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు?

  • మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై సమాలోచన

  • ‘పది’ పరీక్షలకు ముందా, తర్వాతా?.. నేటి క్యాబినెట్లో స్పష్టత

  • సహకార పదవుల భర్తీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో 3 కొత్త కార్పొరేషన్ల మధ్య ఉద్యోగుల విభజన, కొత్త ఉద్యోగాల అవసరంపై సమీక్ష

  • ప్రభుత్వ పరిధిలోకి మెట్రోను తీసుకునే అంశంపైనా చర్చ

  • రైతుభరోసా, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారు

  • మహాలక్ష్మి స్మార్ట్‌కార్డు, గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సోమవారం స్పష్టత రానుంది. ప్రాథమిక సహకార సంఘాల పదవుల భర్తీ, రైతు భరోసా నిధుల విడుదల, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారు వంటి అంశాలపై నిర్ణయాలు వెలువడనున్నాయి. సోమవారం మధ్యాహ్నం తరువాత సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర దాటింది. ఎన్నికలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇటీవలి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ సత్తా చాటిన నేపథ్యంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. పరిషత్‌ ఎన్నికలను నిర్వహించాలనుకుంటే.. మార్చి 14లోపే పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి పదోతరగతి పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు, ఎన్నికలు ఒకేసారి ఉంటే ఇబ్బంది తప్పదు. ఈ నేపథ్యంలో పరిషత్‌లకు ప్రత్యక్ష ఎన్నికా, పరోక్ష ఎన్నికా? టెన్త్‌ పరీక్షలకు ముందా, తర్వాతా అన్నదానిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇక ప్రాథమిక సహకార సంఘాల (కో-ఆపరేటివ్‌ సొసైటీ) పదవులను నామినేటెడ్‌ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైనా నిర్ణయం వెలువడనుంది.

బడ్జెట్‌ సమావేశాల తేదీలపై స్పష్టత

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశాలను ఎప్పటి నుంచి చేపట్టాలన్న దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వివిధ శాఖలు, అంశాల వారీగా బడ్జెట్‌ పద్దులపైనా చర్చించే అవకాశం ఉంది. యాసంగి రైతుభరోసా విడుదల, నిధుల సర్దుబాటుపై సమీక్షించనుంది. ఇటీవల ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ, మ ల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఉద్యోగులు, సిబ్బంది సర్దుబాటు, పాలకవర్గాలకు భవనాలు తదితర కీలక అంశాలపై.. ప్రస్తుతం ప్రైవేటు పరిధిలో ఉన్న మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసు కోవడం, తర్వాత నిర్వహణ అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. దేవాదుల ప్యాకేజీ-3 పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డు, గిగ్‌ వర్కర్ల బిల్లుపైనా చర్చించనున్నట్టు సమాచారం. ఇక కీలకమైన ‘గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు’, హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ కోసం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో 500 ఎకరాల మేర భూముల కేటాయింపు అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

Updated Date - Feb 23 , 2026 | 02:31 AM