Share News

పంచాయతీలకు రూ.387 కోట్ల కేంద్ర నిధులు

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:43 AM

తెలంగాణ గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది.

పంచాయతీలకు రూ.387 కోట్ల కేంద్ర నిధులు

  • నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్‌, పిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. పంచాయతీలకు పాలక వర్గాలు లేనికారణంగా కేంద్రంనుంచి రావాల్సిన 15వ ఆర్థికసంఘం నిధులు నిలిచిపోయాయి. రెండు నెలలకిందట ఎన్నికలు జరిగి, సర్పంచులు కొలువుదీరడంతో.. బకాయి నిధులను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీని ఆధారంగా విడతలవారిగా బకాయి నిధులు చెల్లించేందుకు కేంద్ర ఆర్థికశాఖ సుముఖత వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఈనెల 5న మొదటి విడత రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. గురువారం రూ.387 కోట్లు విడుదల చేసింది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధుల విడుదల ఊరట కలిగిస్తోంది. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు ఇంకా రూ.2400 కోట్ల వరకు రావాల్సి ఉంది. అయితే ఈ మొత్తాన్ని విడతల వారిగా మార్చి 31నాటికి చెల్లించే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి చేసిన ప్రతిపాదనలపై కేంద్రం స్పందించి విడతల వారిగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించడం పంచాయతీల ప్రగతికి బాటలు వేసినట్లయిందన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 05:43 AM