Share News

పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి?

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:37 AM

గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తూ.. పల్లె ఆర్థిక స్వేచ్ఛకు పెద్దపీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి?

  • పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 70 (3)కు సవరణ

  • పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు!

  • 111 జీవో నుంచి వట్టినాగులపల్లి సహా 9 ఊర్లకు విముక్తి

  • నేడు క్యాబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తూ.. పల్లె ఆర్థిక స్వేచ్ఛకు పెద్దపీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 70 (3)కి సవరణ చేయనుంది. దీనికి సంబంధించిన ఫైల్‌ను పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్‌ సమావేశంలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 70(3) ప్రకారం గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని నిధులనూ సమీప ప్రభుత్వ ట్రెజరీలోనే జమ చేయాల్సి ఉంది. ఈ నిబంధన వల్ల పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోందని గుర్తించిన ప్రభుత్వం.. చట్ట సవరణకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై విధించిన పరిమితులను తొలగించి.. పాత విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత సవరణ మేరకు గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా పంచాయతీ బ్యాంకు ఖాతాలోనే జమ చేసే వెసులుబాటును కల్పించనున్నారు. ఈ మార్పుతో పంచాయతీలు సొంత ఆదాయాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా వినియోగించుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ, అత్యవసర మరమ్మతులు వంటి పనులను జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు అవకాశముంటుందన్నారు.


111 జీవో నుంచి 10 గ్రామాలకు రిలీఫ్‌..

హైదరాబాద్‌ మహా నగర జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ల సంరక్షణ కోసం తెచ్చిన 111 జీవో పరిధి నుంచి పది గ్రామాలకు ఊరట లభించనుంది. జంట జలాశయాల పరీవాహకంలోని 84 గ్రామాల నుంచి పది గ్రామాలను తొలగించనున్నారు. హైదరాబాద్‌ చుట్టూరా ఔటర్‌ రింగ్‌ రోడ్డును జంట జలాశయాలకు సమీపంలో నుంచి నిర్మించడంతో ఆ 8 పరీవాహక ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పటికే రెవెన్యూ, హెచ్‌ఎండీఏతో పాటు వాటర్‌బోర్డు, ఈపీటీఆర్‌ఐ అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. జంట జలాశయాల సంరక్షణకు సంబంధించి ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ) కూడా ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఔటర్‌ గ్రోథ్‌ కారిడార్‌ పరిధిలో ఉండే ఈ పది గ్రామాలను 111 జీవో నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు శుక్రవారం క్యాబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఈ ఆమోదం తర్వాత హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగానే.. శంషాబాద్‌ మండలంలోని 9 గ్రామాలతో పాటు రాజేంద్రనగర్‌ మండలంలోని వట్టినాగులపల్లి పరిధిలో 17,710 ఎకరాలకు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తుతమున్న బయో కన్జర్వేషన్‌ జోన్‌ను తొలగించనున్నారు. కేవలం కన్జర్వేషన్‌ జోన్‌ను మాత్రమే కొనసాగించనున్నారు. దీంతో ఈ పరిధిలో లే అవుట్లు వేసుకోవాలన్నా, భవన నిర్మాణ అనుమతులు పొందాలన్నా హెచ్‌ఎండీఏ నుంచి చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ (ల్యాండ్‌ కన్వర్షన్‌) చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jul 17 , 2026 | 05:40 AM