Share News

దొడ్డు ధాన్యం వేలానికి సర్కారు అనుమతి

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:47 AM

రాష్ట్రంలో గడిచిన యాసంగి (2025-26 రబీ) సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన దొడ్డు ధాన్యంలో 10.40 లక్షల మెట్రిక్‌ టన్నులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

దొడ్డు ధాన్యం వేలానికి సర్కారు అనుమతి

  • టెండరు ద్వారా 10.40 లక్షల టన్నులు అమ్మాలని నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన యాసంగి (2025-26 రబీ) సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన దొడ్డు ధాన్యంలో 10.40 లక్షల మెట్రిక్‌ టన్నులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్టీఫెన్‌ రవీంద్ర తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. యాసంగిలో మొత్తం 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం ఉండగా.. కేంద్ర ప్రభుత్వం 51.60 లక్షల మెట్రిక్‌ టన్నులకు మాత్రమే అనుమతినిచ్చింది. దీనిని మిల్లింగ్‌ చేసి 35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని.. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్రం కోటా కింద ఈ మేరకు కేటాయుంచగా.. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) అవసరాల కోసం 13 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఇవ్వాల్సిన కోటా పూర్తయిన తర్వాత 10.40 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం మిగులుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు సర్కారు టెండర్ల పద్ధతిలో ఈ దొడ్డు ధాన్యం అమ్మకానికి ఆమోదం తెలిపింది.

Updated Date - Jul 13 , 2026 | 05:48 AM