Share News

వరి సాగును నియంత్రించండి

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:07 AM

రాష్ట్రంలో కరువు పరిస్థితులతో పాటు రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకున్నందున వరిసాగును నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

వరి సాగును నియంత్రించండి

  • ఆరు తడి పంటలను ప్రోత్సహించండి.. వర్షాల్లేవు, డెడ్‌ స్టోరేజీకి రిజర్వాయర్లు

  • ఆగస్టులోనూ వానలు అనుమానమే

  • 3దశల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక

  • రైతులు వరికి బదులుగా చిరుధాన్యాల సాగు చేసేలా అవగాహన కల్పించాలి

  • ఎల్‌నినోపై సమీక్షలో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌/పటాన్‌చెరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులతో పాటు రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకున్నందున వరిసాగును నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నీళ్లు ఎక్కువగా అవసరం రాని ఆరుతడి పంటలను సాగుచేయాలని రైతులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో వ్యవసాయ, విద్యుత్తు, ఉద్యానవన, వాతావరణ, పశుసంవర్ధక, భూగర్భజల, నీటిపారుదల శాఖల అధికారులతో సోమవారం తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. ఎల్‌నినోను ఎదుర్కోవటానికి జిల్లాల వారీగా ప్రణాళికలను రూపొందించి అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం తప్పకుండా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా జూలై 15, జూలై 30, ఆగస్టు 15.. ఈ తేదీలను ప్రామాణికంగా తీసుకొని ప్రతీ 15రోజులకొకసారి వర్షపాతాన్ని విశ్లేషించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను మూడు దశల్లో అమలు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన విత్తనాలను అన్ని మండలాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. పప్పులు, చిరుధాన్యాలు, వేరుశనగ, కందులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేసే విధంగా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింది భూముల్లోనూ ఆరుతడి పంటలే వేయాలని, ఆగస్టులో కూడా తక్కువ వర్షపాతమే ఉంటుందని చెప్పారు. బావులు, బోర్ల కింద చిరుధాన్యాలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో సాధారణ, 20 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలకు, ఎరువులకు కొరత లేదన్నారు. ప్రతి రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో మార్గనిర్దేశం చేయాలన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుకు అండగా ఉంటుందని తుమ్మల భరోసా ఇచ్చారు.

Updated Date - Jul 14 , 2026 | 06:08 AM