నేటి నుంచి సొసైటీ పదవుల జాతర!
ABN , Publish Date - May 07 , 2026 | 04:43 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పదవుల జాతర గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఇచ్చిన జాబితాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీకానున్నాయి.
జిల్లా ఇన్‌చార్జి మంత్రుల జాబితాల ప్రకారం నియామకాలు
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పదవుల జాతర గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఇచ్చిన జాబితాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీకానున్నాయి. తొలుత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటారు. వారు వాటిని ఉమ్మడి జిల్లాలవారీగా ఇన్‌చార్జి మంత్రులకు సమర్పిస్తారు. ఇన్‌చార్జి మంత్రులు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖకు జాబితా పంపించగానే ఉత్తర్వులు వెలువడతాయి. క్యాబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే సమాచారాన్ని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు చేరవేశారు. క్షేత్రస్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయని, గురువారం నుంచి ప్రతిపాదనలు వస్తాయని, వెంటవెంటనే జీవోలు జారీ చేస్తామని సహకార శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీఏసీఎ్‌సల పాలకవర్గ సభ్యులను నియమించే ప్రక్రియలో సభ్యత్వం కీలకం కానుంది. 2025 మార్చి 31 నాటికి సొసైటీల్లో సభ్యులుగా ఉన్నవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. డిఫాల్టర్ అయ్యి ఉండకూడదు. ఏదైనా కేసుల్లో జైలు శిక్ష అనుభవించి ఉంటే చాన్స్ ఉండదు. సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమీప బంధువై ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి రాష్ట్రంలోని 908 పీఏసీఎ్‌సలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి.