కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:14 AM
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విస్మరించారని, కేంద్రం చాలా అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏం తప్పు చేసింది: భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విస్మరించారని, కేంద్రం చాలా అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు. ఆదివారం ప్రజాభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం సహా మంత్రులు, ఎంపీల బృందంతో కలిసి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినా బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు దక్కలేదన్నారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారనుకున్నామని, కానీ ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. బయోఫార్మా, కెమికల్ పార్కులపై కేంద్రం ఫోకస్ చేసినా హైదరాబాద్‌కు సంబంధించి ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని, కానీ ఆఫర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాల్లోనూ తెలంగాణ పేరు కనిపించలేదని చెప్పారు. పర్యాటక రంగంలోనూ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూపిందన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ప్రత్యేక కేటాయింపులు లేవని ఆక్షేపించారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు న్యూజిలాండ్‌కు చెందిన గిరిజనులు కూడా వచ్చారని, మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. సంక్షేమం గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదన్నారు. మూడు రైళ్లు మాత్రమే ఇచ్చి.. ఆర్థిక వృద్ధికి అవసరమైన మౌలికవసతులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో తాము ముందుకెళ్తుంటే, కేంద్రం ప్రోత్సహించాల్సింది పోయి నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర లక్ష్యాల సాధనకు కలిసి పనిచేయాలని తాము భావించినా, తెలంగాణను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు.
కేసీఆర్‌పై కక్ష సాధింపు ప్రభుత్వ లక్ష్యం కాదు
దేశ రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేయాలి కానీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ట్యాపింగ్ చేస్తే ఎలా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు ప్రభుత్వ లక్ష్యం కాదని, పారదర్శకంగా పాలన అందించడమే తమ ప్రాధాన్యమన్నారు. విచారణ జరిగే ప్రక్రియపై తాను వ్యాఖ్యానించబోనని, ఏం మాట్లాడినా ఆ అంశాన్ని ప్రభావితం చేసినట్లువుతుందన్నారు. విచారణ ఎవరి ఇష్టప్రకారం జరగదని, చట్టబద్ధంగానే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.