కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీకి చెక్!
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:27 AM
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టి, వారి శ్రమను దోచుకుంటున్న ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఉద్యోగుల జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐపై ఆడిటింగ్
ఉన్నతస్థాయి కమిటీ వేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు
45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టి, వారి శ్రమను దోచుకుంటున్న ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ‘ఉద్యోగుల పొట్టగొట్టి.. ఏజెన్సీల దోపిడీ’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఏజెన్సీల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పనితీరుపై సమగ్ర ఆడిటింగ్, క్రమబద్థమైన పర్యవేక్షణ కోసం ఆరుగురు సభ్యులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్థికశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సభ్యులుగా కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి డి.హరిచందన, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఇ.వి.వి.నాగేశ్వరరావు, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ద్రాక్షామణి, అదేవిధంగా జీఏడీ (సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎమ్) ప్రతినిఽధిని నియమించారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైతే ఇతర శాఖల అధికారులు, నిపుణులను కమిటీలోకి తీసుకునే (కో-ఆప్ట్) వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కమిటీ పరిశీలించాల్సిన అంశాలు..
రాష్ట్రంలో 4,800 ఉద్యోగ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 2.21 లక్షల మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకుంటున్న దానికి, వాస్తవంగా చెల్లిస్తున్న దానికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంటోంది. ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఈఎస్ఐ చందాలను సైతం ఏజెన్సీలు సక్రమంగా చెల్లించడం లేదు. కమీషన్ రూపంలో నెలకు రూ.200 కోట్ల వరకు మిగుల్చుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో వీటి వ్యవహారాలను సమగ్రంగా పరిశీలించేందుకు, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ఈ కమిటీ సమగ్ర ఆడిటింగ్ నిర్వహించనుంది. నిబంధనల మేరకు ఉద్యోగులకు వేతనాలను సకాలంలోనే చెల్లిస్తున్నాయా? ఈపీఎఫ్, ఈఎస్ఐ వాటాలను సకాలంలో జమ చేస్తున్నాయా? తనిఖీ చేయాల్సి ఉంటుంది. అటెండెన్స్, వేతనాల రిజిస్టర్లను తనిఖీ చేస్తుంది. అదేవిధంగా, భవిష్యత్తులో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నియామకం, నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలను, ప్రామాణిక పద్థతులను ఈ కమిటీ రూపొందించనుంది. ఈ మొత్తం వ్యవస్థను కేంద్రీకృతంగా పర్యవేక్షించేందుకు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు, ఉద్యోగుల పూర్తి వివరాలను భద్రపరిచేందుకు వీలుగా ఐఎ్‌ఫఎంఐఎస్ పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్‌ను తీసుకువచ్చేందుకు సాధ్యసాధ్యాలను కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది.
ప్రభుత్వానికి ధన్యవాదాలు..!
సమగ్ర ఆడిటింగ్ కోసం ప్రత్యేక కమిటీని నియమించడం పట్ల తెలంగాణ ఔట్ సోర్సింగ్ జేఏసీ ఛైర్మన్, అధ్యక్షుడు పులి లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర ఆడిటింగ్ నిర్వహించి, ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం చేసిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి.. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా కమిటీ సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.