ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - May 12 , 2026 | 03:44 AM
రాష్ట్రంలో ఉన్న 5.70 లక్షల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం సంక్షేమ బోర్డును ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని, సర్వీసును క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
సర్వీసును క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలి
జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్
25న చలో ఢిల్లీ.. జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా
జూన్‌లో మిలియన్ మార్చ్: జేఏసీ నేతలు
బర్కత్‌పుర, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న 5.70 లక్షల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం సంక్షేమ బోర్డును ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని, సర్వీసును క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ... ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీఎస్టీని రద్దుచేసి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. జాజుల మాట్లాడుతూ... ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లపై ఢిల్లీలోని రాహుల్‌గాంధీ ఇంటి వద్ద వంటా వార్పు చేస్తేనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ అధ్యక్షుడు పులిలక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, శ్రీనివాస్ మాట్లాడుతూ... ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై 25న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ మొదటి వారంలో మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.