Share News

ఉద్యోగుల పొట్టగొట్టి.. ఏజెన్సీల దోపిడీ

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:18 AM

వచ్చే జీతాలే తక్కువ.. అందులోనే కమీషన్ల పేరుతో ఏజెన్సీల భారీ కోతలు.. ఆ తర్వాతైనా సకాలంలో వేతనం ఇస్తారా అంటే అదీ లేదు..

ఉద్యోగుల పొట్టగొట్టి..  ఏజెన్సీల దోపిడీ

  • కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల

  • శ్రమను దోచుకుంటున్న ఏజెన్సీలు

  • జీతాలు సకాలంలో ఇవ్వకుండా వేధింపులు

  • పీఎఫ్‌, ఈఎస్ఐ ఏళ్లతరబడి ఎగవేత

  • ఉద్యోగులకు వచ్చే అరకొర జీతంలో

  • ఏజెన్సీల కమీషన్లే అధికం

  • కమీషన్‌ నెలకు రూ.200 కోట్లు.. జీఎస్టీ పేరుతోనూ దందా

  • మొత్తం 4,800 ఏజెన్సీలుండగా.. అక్రమాలకు పాల్పడుతున్నవి 4,300

  • సీఎంకు స్వయంగా వెల్లడించిన అధికారులు

  • కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

  • వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్ఐ ప్రభుత్వమే నేరుగా జమచేసేందుకు కసరత్తు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): వచ్చే జీతాలే తక్కువ.. అందులోనే కమీషన్ల పేరుతో ఏజెన్సీల భారీ కోతలు.. ఆ తర్వాతైనా సకాలంలో వేతనం ఇస్తారా అంటే అదీ లేదు.. మూడు నాలుగు నెలలకోసారి అలా విదిలిస్తుంటారు. ఇక ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌), ఈఎస్ఐ లాంటి వాటి గురించి అడగనేకూడదు. ఇంత దోపిడీ చేస్తున్నవారు ఉద్యోగులకు చేతినుంచేమీ జీతాలు ఇవ్వటం లేదు. వారు ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమయానికే జీతాల డబ్బు తీసుకుంటారు. ఉద్యోగులకు మాత్రం ఇవ్వరు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 2.21 లక్షల మంది అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల దయనీయ పరిస్థితి ఇది. వీరి శ్రమను పెట్టుబడిగా పెట్టి కొన్ని ఏజెన్సీలు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలైతే ఉద్యోగులే లేకుండా రికార్డుల్లో పేర్లు నమోదు చేసి.. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.కోట్ల జీతాలను కొల్లగొడుతున్నాయి. ఈ మోసాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మోసాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల జీతాలు, పీఎఫ్‌, ఈఎస్ఐ ల చెల్లింపు, ఇతర వివరాలను డిజిటలైజ్‌ చేయాలని సూచించారు. ఏజెన్సీల ప్రమేయం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా ఒకటో తేదీనే జీతం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈఎస్ఐ, పీఎఫ్‌ కూడా ప్రభుత్వమే నేరుగా జమచేయాలని కసరత్తు చేస్తోంది.


అడుగడుగునా మోసాలే..

రాష్ట్రంలో 4,800 ఉద్యోగ ఏజెన్సీలు ఉన్నాయి. అందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని అధికారులే స్వయంగా సీఎంకు వివరించారు. ఒక అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.21,500 జీతం ఉంటే.. రూ.13,500 మాత్రమే చెల్లిస్తూ మిగిలిన మొత్తాన్ని కమీషన్ల రూపంలో ఏజెన్సీలు నొక్కేస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. తాండూరు జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి ఏజెన్సీ పీఎఫ్‌ బకాయిలు చెల్లించకపోవటంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది. యాదాద్రి వైద్య కళాశాలలో పనిచేస్తున్న 60 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 4 నెలల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్‌ చెల్లించడంలేదని ఫిర్యాదులు వచ్చాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విశ్వముఖ అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా 10 మంది పనిచేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి పీఎఫ్‌ కింద 2025, ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు రూ.18,000 చెల్లించాల్సి ఉండగా.. రూ.10,800 మాత్రమే ఏజెన్సీ జమ చేసిందని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. నెలనెలా జమ చేయకపోవడంతో పీఎఫ్‌ సేవలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ అయితే అసలు కట్టనే లేదని చెబుతున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలో సైరా సాఫ్ట్‌వేర్‌ అనే ఏజెన్సీ తరఫున స్ర్తీ, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏడుగురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 2019 నుంచి 2023 వరకు ఈఎస్ఐ, పీఎఫ్‌ చెల్లించలేదు. సుమారు రూ.9 లక్షల బకాయిలు చెల్లించకపోయినా ఎవరూ పట్టించుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందు మున్సిపాలిటీలో నీటి సరఫరా విభాగంలో 39 మంది, పారిశుద్ధ్య విభాగంలో 95 మంది మేక్‌మా టీఐఎఫ్‌ ఏజెన్సీ ద్వారా పని చేస్తున్నారు. వీరికి 2022, ఆగస్టు నుంచి 2024, ఏప్రిల్‌ వరకు 44 నెలల పీఎఫ్‌ సొమ్మును సదరు ఏజెన్సీ జమ చేయలేదని చెబుతున్నారు. వినాయక ఏజెన్సీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు 8 నెలల పీఎఫ్‌ జమ చేయలేదు. నక్షత్ర ఏజెన్సీ 14 బీసీ హాస్టళ్లకు ముగ్గురు చొప్పున అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను అందిస్తోంది. ఈ ఏజెన్సీ నిర్వాహకులు రెండేళ్ల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్‌ చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా దేవాదాయశాఖలో ఎక్స్‌ట్రీమ్‌ ఇన్ఫర్మేషన్‌ అనే ఏజెన్సీ తరఫున పనిచేసే ఉద్యోగులకు మూడు సంవత్సరాల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్‌ చెల్లించటంలేదు.


జీఎస్టీ పేరుతోనూ దందా

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించారు. క్యాటగిరీ -1 ఉద్యోగికి బేసిక్‌ వేతనం రూ.15,600. ప్రభుత్వం నుంచి ఏజెన్సీకి వచ్చే మొత్తం 13 శాతం పీఎఫ్‌ కింద రూ.2,028, ఈఎస్ఐ కోసం 3.25 శాతం కింద రూ.507, ఏజెన్సీ కమీషన్‌ 4 శాతం కింద రూ.624 కలిపితే రూ.18,759 అవుతుంది. దీనికి 18 శాతం జీఎస్టీ కింద రూ.3,377 కలిపి ఒక ఉద్యోగికి రూ.22,136 చెల్లిస్తుండగా.. ఉద్యోగి చేతికి వస్తున్నది రూ.13,611 మాత్రమే. ఇందులో ఉద్యోగి బేసిక్‌ వేతనం నుంచి కట్‌ చేసేవి పీఎఫ్‌ 12 శాతం, ఈఎస్ఐ, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ 0.75 శాతం. ఒక ఏజెన్సీ తన కమీషన్‌, పీఎఫ్‌, ఈఎస్ఐ, జీఎస్టీతో కలిపి తీసుకుంటున్న మొత్తం రూ.9,425 ఉంది. క్యాటగిరీ-2 ఉద్యోగి బేసిక్‌ వేతనం రూ.19,500 కాగా, ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం రూ.26,979. అయితే అతడి చేతికి వస్తున్నది రూ.17,404 మాత్రమే. ఈ క్యాటగిరీ ఉద్యోగులకు 18 శాతం జీఎస్టీ కింద ప్రభుత్వం ఏజెన్సీలకు రూ.4,115 చెల్లిస్తోంది. క్యాటగిరీ-3 ఉద్యోగి బేసిక్‌ వేతనం రూ.22,750 కాగా, అన్నీ కలిపి ప్రభుత్వం రూ.31,092 చెల్లిస్తోంది. ఆ ఉద్యోగి చేతికి వస్తున్నది రూ.20,579 మాత్రమే. ఏజెన్సీలు ఉద్యోగుల జీఎస్టీ రూపంలోనే కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.

ఏజెన్సీల కమీషన్‌ నెలకు రూ.200 కోట్లపైనే..

కమీషన్‌ రూపంలో ఏజెన్సీల ఖాతాల్లో ప్రతి నెలా సుమారు రూ.200 కోట్లు జమ అవుతున్నాయి. అయితే, అత్యధిక శాతం ఏజెన్సీలు ఉద్యోగులకు పీఎఫ్‌, ఈఎస్ఐ సకాలంలో చెల్లించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెన్సీల్లో చాలావరకు ప్రభుత్వ అధికారులు, వారి బినామీల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఎన్ని అక్రమాలకు పాల్పడినా వాటిపై చర్యలు తీసుకోరని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఏజెన్సీల అక్రమాలు, నకిలీ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. చాలా సందర్భాల్లో అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీలను జిల్లా కలెక్టర్లు బ్లాక్‌ లిస్టులో పెడితే, నాలుగు నెలలు తిరక్కుండానే మరో పేరుతో తెరమీదకు వస్తున్నాయని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు.


ఏజెన్సీలను రద్దు చేయడమే పరిష్కారం

రాష్ట్రంలో 89శాతానికి పైగా ఏజెన్సీలు ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసినా.. పీఎఫ్‌, ఈఎస్ఐనెలల తరబడి చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆ ప్రయోజనాలకు దూరమవుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేసి.. నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోనే వేతనాలు జమచేసే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది.

- పులి లక్ష్మయ్య, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌

Updated Date - Jul 11 , 2026 | 06:20 AM